Suryapet: రైతు బతుకులో నిప్పులు పోసిన గ్యాస్‌.. బీరువాలో దాచిన రూ. 6 లక్షలు..

Suryapet: LPG Cylinder Exploded In Farmer House, 6 Lakhs Burnt In Fire - Sakshi

సాక్షి, సూర్యపేట: ప్రమాదవశాత్తు గ్యాస్‌ లీకై గుడిసె దగ్ధం కావడంతో ఓ రైతు కుటుంబం బతుకు బుగ్గిపాలైంది. గుడిసెలోని నగదుతోపాటు సామాగ్రి కాలిపోయి కట్టుబట్టలు మిగలడంతో కన్నీరుమున్నీరవుతోంది ఆ కుటుంబం. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రిలో గురువారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం,.. నేలమర్రి గ్రామానికి చెందిన కప్పల లక్ష్మయ్య, నాగమణి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు.

లక్ష్మయ్య సూర్యాపేట మండల కేటీ అన్నారం గ్రామంలో తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని ఇటీవల విక్రయించగా వారం రోజుల క్రితం రూ.9 లక్షలు వచ్చాయి. ఇందులో నుంచి రూ. 3 లక్షలను గ్రామంలోని ఓ పెద్దమనిషి వద్ద ఉంచి మిగతా రూ. 6 లక్షలు గుడిసెలోని బీరువాలో దాచారు.

అయితే గురువారం లక్ష్మయ్య తన భార్యతో కలిసి పొలం పనులకు వెళ్లాడు. అనంతరం లక్ష్మయ్య పెద్ద కుమార్తె వంట చేసేందుకు ఇంట్లోని గ్యాస్‌ సిలిండర్‌ను వెలిగించగా, గ్యాస్‌లీక్‌ కావడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు లేచి గుడిసెకు అంటుకున్నాయి.

లక్ష్మయ్య కుమార్తె బయటకు వచ్చికేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి మంటలు ఆర్పే లోగా రూ. 4 లక్షల విలువైన సామగ్రితోపాటు బీరువాలో ఉన్న రూ.6 లక్షల నగదు పట్టాదారు పాసుపుస్తకాలు అగ్రికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న​ మునగాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top