తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 68,445 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,383 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కాను కల రూపంలో హుండీలో రూ.3.79 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.
ఆటోను ఢీకొన్న బైక్..
ఒకరి మృతి
పెళ్లకూరు: మండలంలోని జాతీయ రహదారిలో నెలబల్లి క్రాస్‌రోడ్డు వద్ద శుక్రవారం బైక్ ఆటోను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. శ్రీకాళహస్తి పట్టణం, బహుదూర్‌పేట ప్రాంతానికి చెందిన సెంజీ సుబ్రమణ్యం(46) మృతి చెందగా, సముజాకుల వంశీతో కలిసి కనుపూరులో దైవదర్శనం అనంతరం తిరిగి మోటారుబైక్‌లో శ్రీకాళహస్తికి బయలుదేరి వెళుతున్నారు. మార్గం మధ్యలో నెలబల్లి క్రాస్‌రోడ్డు వద్ద ముందు వెళుతున్న ఆటోను ప్రమాదవశాత్తు బైక్ ఢీకొంది. ఈ ఘటనలో సుబ్రమణ్యం, వంశీ ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్సల నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. రుయాలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం సుబ్రమణ్యం మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతునికి భార్య సునీత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
దొంగలను పట్టుకున్న గ్రామస్తులు
పెళ్లకూరు: మండలంలోని ఆర్లపాడు సమీపంలో విద్యుత్ మోటారు చోరీ చేసి తీసుకెళుతున్న దొంగలను గ్రామస్తులు పట్టుకున్న సంఘటన శనివారం పునబాక గ్రామంలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. ఆర్లపాడు గ్రామానికి చెందిన మణికిరి సతీష్‌కు చెందిన విద్యుత్ మోటారును బండి రవి, బండి సూర్య చోరీ చేసి మోటారుబైక్‌లో తీసుకెళుతుండగా మార్గం మధ్యలో పునబాక వద్ద స్థానికులు గుర్తించి పట్టుకున్నారు. పట్టుబడిన దొంగలను స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బావిలోపడి సచివాలయ ఉద్యోగి మృతి
వడమాలపేట (పుత్తూరు):మండలంలోని రామరాజుకండ్రిగ గ్రామంలో శనివారం బావిలోపడి సచివాలయ ఉద్యోగి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి ఇందిరానగర్‌కు చెందిన సచివాలయ ఉద్యోగి చంద్రకుమార్(37) తన స్నేహితులు లక్ష్మీనారాయణ, అభిషేక్‌తో కలిసి రామరాజుకండ్రిగ గ్రామానికి వచ్చారు. ముగ్గురూ కలిసి సమీపంలోని ఓ బావి వద్దకు వెళ్లారు. అక్కడ చంద్రకుమార్ అదుపుతప్పి బావిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. అతనితో వచ్చిన ఇద్దరు స్నేహితులు గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులకు విషయం తెలిపారు. వారు అక్కడికి వెళ్లి చంద్రకుమార్‌ను వెలికి తీశారు. అతను అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఎస్‌ఐ హరీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


