తిరుపతి ఎడ్యుకేషన్ : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (ఎన్‌సీఎస్‌ఎం) ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని తిరుపతిలోని రీజినల్ సైన్స్ సెంటర్‌లో శనివారం ‘‘మై సైన్స్ గ్యారేజ్’’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్న వయసులోనే పిల్లల్లో సైన్స్‌పై మక్కువ, జిజ్ఞాసను పెంపొందించేందుకు 3, 4, 5వ తరగతి విద్యార్థులకు అనువుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కె.శ్రీనివాస నెహ్రూ తెలిపారు. ఈ వయస్సు పిల్లల్లో సహజంగా నేర్చుకోవాలన్న తపన ఎక్కువగా ఉంటుందని, వారి ఆలోచనలను ఆచరణాత్మకం చేయించడమే ఈ గ్యారేజీ ముఖ్య ఉద్ధేశమని తెలిపారు. పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా వారికి మేకర్ కల్చర్ (సృజనాత్మకత) పెంపొందించడం, అలాగే వారే స్వయంగా ప్రయోగాలు చేసేలా, విభిన్న వస్తువులు రూపొందించేలా సైన్స్‌లోని మూల సూత్రాలను అనుభవపూర్వకంగా నేర్చుకునేలా ఈ గ్యారేజ్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏడాది పొడవునా 12 నెలల పాటు ప్రతి నెల మొదటి ఆదివారం మై సైన్స్ గ్యారేజ్‌ను నిర్వహించనున్నామని, దీనికి సంబంధించిన మెటీరియల్‌ను సైన్స్ సెంటర్ అందిస్తుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో విభిన్న కార్యక్రమాలను నిర్వహించారు. అంతకుముందు సైన్స్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన త్రీ వే స్లైడర్‌ను చిన్నారులతో ప్రారంభించారు.


