రేణిగుంట: పట్టణంలోని వినాయక నగర్‌లో గత ఫిబ్రవరి నెలలో తెలుగు గంగ పైపులైన్‌పైనే స్థానిక తెలుగు తమ్ముళ్ల అండతో అక్రమ నిర్మాణం చేపట్టారు. అప్పటి పంచాయతీ పాలకవర్గం అడ్డు చెప్పడంతో పంచాయతీ అధికారులు మార్చి 4వ తేదీన వెళ్లి అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. ప్రస్తుతం పంచాయతీ పాలకవర్గం పాలన ముగిసి ప్రత్యేక అధికారుల పాలన మొదలవడంతో ఇక తమకు అడ్డు ఎవరనేలా మళ్లీ అదే స్థానంలో నిర్మాణం చేపట్టారు. స్థానికుల సమాచారంతో నిర్మాణాలను తొలగించేందుకు రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. తాత్కాలికంగా పనులు ఆపించి కట్టడాలను తొలగించే ప్రయత్నం చేయడంతో స్థానిక తెలుగు తమ్ముళ్లు ఒత్తిడి తేవడంతో ఆ స్థలం తమ పరిధిలోకి రాదని రైల్వేకి సంబంధించిన స్థలం అని చెప్పి వెనుతిరిగి వెళ్లారని స్థానికులు వాపోయారు. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డిని వివరణ కోరగా కట్టడాలు నిర్మిస్తున్న ప్రదేశం ప్రైవేట్ భూ యజమాని రైల్వే పరిధిలోకి వస్తుందన్నారు. అక్కడ ప్రభుత్వ భూమి ఏమీ లేదని తెలిపారు. రైల్వే వారు సర్వే కోసం తమను సంప్రదిస్తే సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తామని అన్నారు.


