సత్యవేడు: ఉపాధి హామీ పనుల్లో అవినీతికి పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులకు సంబంధించి సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని డ్వామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 28 పంచాయతీల పరిధిలో 672 పనులకు రూ.12.81 కోట్టు ఖర్చు చేశారు. ఆడిట్ సిబ్బంది పరిశీలనలో చిన్నఈటిపాకం, కొత్తమారికుప్పం, మల్లవారిపాళెం వెస్టు, ఇరుగుళం పంచాయతీలలో పశువులు షెడ్లు కొన్ని అసంపూర్తి, మరి కొన్ని పూర్తి చేసి దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించారు. ఆంబాకం పంచాయతీలో 8 మంది కూలీల్లో మహిళలకు బదులుగా పురుషులు పనిచేస్తున్నారని ఫిర్యాదు రావడంతో ఫీల్డు అసిస్టెంట్ పి.అరుణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పలు పంచాయతీల్లో జరిగిన అవకతవకలకు రూ. 1.33 లక్షలు రికవరీకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ సరిత, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఏఓ త్రివిక్రమరావు, ఏపీఓ విజయభాస్కర్, డీఆర్పీలు కమల్‌నాద్, కావమ్మ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డు అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు జాయింట్ ఆపరేషన్
తిరుపతి క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు తిరుపతి జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటీవల చోటుచేసుకున్న విషాద ఘటనల నేపథ్యంలో జాతీయ రహదారులపై సుదూర ప్రయాణ వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు, రవాణా, అగ్నిమాపక శాఖలు సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించాయి. టోల్‌ప్లాజాల వద్ద భద్రతా ప్రమాణాలు, వాహనాల స్థితి, అగ్నిమాపక ఏర్పాట్లపై అధికారదులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు నేతృత్వంలో ఈ సంయుక్త తనిఖీలు చేపట్టారు. ఏర్పేడు, వడమాలపేట టోల్‌ప్లాజాల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ట్రావెల్స్ వాహనాలు, సుదూర ప్రయాణ వాహనాలను ఆపి అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి తనిఖీలను ప్రతిరోజూ నిరంతరంగా నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పేర్కొన్నారు.


