నాయుడుపేట టౌన్: విచారణ పేరుతో తీసుకువచ్చి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి గురువారం నాయుడుపేట జూనియర్ సివిల్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట తనకు జరిగిన అన్యాయాన్ని విన్నవించారని ఆయన తరఫు న్యాయవాది మీడియాకు తెలిపారు. పెళ్లకూరు మండలం కలవకూరు వద్ద స్వర్ణముఖి నదిలో అక్రమ ఇసుక దందాను అడ్డుకోవడంతో సత్యనారాయణరెడ్డితో పాటు పెళ్లకూరు ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్‌రెడ్డి, మరికొంతమంది నాయకులు, రైతులను సైతం అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. విచారణ పేరుతో సత్యనారాయణరెడ్డిని కస్టడీకి తీసుకున్న పెళ్లకూరు పోలీసులు ఆయన్ని బుధవారం ఉదయం పెళ్లకూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే పోలీసులు ఆయనతో మాట్లాడేందుకు విలేకరులను సైతం అనుమతించలేదు. పెళ్లకూరు పోలీస్‌స్టేషన్ నుంచి గురువారం సాయంత్రం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాల వద్దకు తీసుకువచ్చి వైద్య పరీక్షలు జరిపారు. అక్కడి నుంచి నాయుడుపేట జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట సత్యనారాయణరెడ్డిని హాజరుపరిచారు. గురువారం సాయంత్రం తిరిగి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి తరఫు న్యాయవాది చదలవాడ కుమార్ సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ సత్యనారాయణ రెడ్డి తనకు జరుగుతున్న అన్యాయం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారని తెలిపారు. విచారణ పేరుతో తీసుకువచ్చి పెళ్లకూరు లాకప్‌లో నిర్బంధించి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో లాకప్‌లో నిర్భంధించి కనీసం నిద్రపోయేందుకు బెడ్డు కూడా ఇవ్వకుండా ఆరోగ్యం సరిగా లేదని మాత్రలు ఇవ్వాలని చెప్పినా ఇవ్వకుండా విచక్షణారహితంగా వ్యవహరించారని సత్యనారాయణరెడ్డి న్యాయమూర్తి ఎదుట తన బాధను చెప్పుకున్నారని చెప్పారు. కేవలం అధికారపార్టీ నేతల ఒత్తిడితో అక్రమ కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని సత్యనారాయణరెడ్డి న్యాయమూర్తి ఎదుట వాపోయినట్లు న్యాయవాది వివరించారు.


