హామీ కనుమరుగు | - | Sakshi
Sakshi News home page

హామీ కనుమరుగు

Mar 10 2026 7:09 AM | Updated on Mar 10 2026 7:09 AM

చెప్పిన మాట.. ఉత్తుత్తి హామీ

47 మరుగుదొడ్లకు రూ.22 కోట్లు

మంజూరుకు ప్రతిపాదనలు

నిధులు లేవంటూ కాలయాపన

ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు, పిల్లలు

ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక.. ఒంటికి రెంటికీ.. ఇంటికి వెళ్లాల్సిన దుస్థితి.. లేదంటే బిగపట్టుకుని ఉండాల్సి వస్తోంది. అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు వంద శాతం నిర్మించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మహిళా దినోత్సవం నాటికి అన్ని స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మిస్తామని విద్యాశాఖా మంత్రి లోకేష్‌ హామీ ఇచ్చారు. అయితే నిధులు లేవంటూ కాలయాపన చేస్తున్నారు. దీంతో ఆ హామీలు నీటి మూటలయ్యాయి.. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం మరుగుదొడ్లు అన్న విషయం నెరవేరలేదు.. దీంతో సర్కారు పాఠశాలల్లోని బాలికలు ఒంటికి.. రెంటికి వెళ్లాలంటే తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

జిల్లా వివరాలివీ..

ప్రాథమిక పాఠశాలలు 1,838

విద్యార్థుల సంఖ్య 54,815

ప్రాథమికోన్నత పాఠశాలలు 176

విద్యార్థుల సంఖ్య 14,067

ఉన్నత పాఠశాలలు 320

విద్యార్థుల సంఖ్య 89,358

మొత్తం పాఠశాలలు 2,334

మొత్తం విద్యార్థుల సంఖ్య 1,58,240

జిల్లాలో ఉండాల్సిన యూనిట్లు 5,274

3 నుంచి 5 మరుగుదొడ్ల సమూహం: యూనిట్‌

30 మంది పిల్లలకు అవసరం: ఒక యూనిట్‌

జిల్లాలో ప్రస్తుతం ఉన్న యూనిట్లు 1750

మరుగుదొడ్లు ఉన్న పాఠశాలలు 40 శాతం

పిల్లల సంఖ్యకు ఆధారంగా 100 శాతం: లేవు

పూర్తిగా మరుగుదొడ్లు లేని స్కూళ్లు 400

మరుగుదొడ్లు లేని స్కూళ్లు 250

తిరుపతి అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లా వ్యాప్తంగా పిల్లలకు అవసరం అయిన మేరకు మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. ప్రధానంగా బాలికలు నానా తిప్పలు పడుతున్నారు. 2026 జాతీయ మహిళా దినోత్సవం నాటికి ప్రతి బడిలో మరుగుదొడ్డి సౌకర్యం కల్పిస్తామని విద్యాశాఖా మంత్రి లోకేష్‌బాబు ఇచ్చిన హామీ ఉత్తుత్తిగానే మిగిలిపోతుందని పలువురు మండిపడుతున్నారు. ప్రతిపాదనలు పంపండి.. వెంటనే నిధులు మంజూరు చేస్తామని చెప్పడంతో పూర్తిగా మరుగుదొడ్లు లేకుండా ఉన్న 47 పాఠశాలలను సర్వశిక్ష అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ నేతృత్వంలో గుర్తించి, రూ.22 కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు పంపించారు. అయితే ఇప్పటి వరకు పైసా నిధులు విడుదల చేయలేదు.

నెరవేరని హామీ

జాతీయ మహిళా దినోత్సవం మాత్రం వచ్చి పోయింది. అయితే విద్యాశాఖా మంత్రి లోకేష్‌బాబు మాత్రం తానిచ్చిన హామీని గంగలో కలిపేశారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలోని తొమ్మిది ప్రాథమిక పాఠశాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.53 లక్షలు మంజూరు చేశారు. అయితే ఇప్పటి వరకు టెండర్లు నిర్వహించకపోవడంతో నిర్మాణ ప్రక్రియకు బ్రేక్‌ పడింది. గతంలో ప్రతి పాఠశాల చుట్టు విశాలమైన స్థలాలు ఉండడంతోపాటు చెట్లు, పొదలు పెద్ద ఎత్తున ఉండేవి. బాలికలు ఆ పొదల మాటున ప్రకృతి అవసరాలు తీర్చుకునే వారు. అయితే భూములకు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చెట్లు, పొదలు కరువయ్యాయి. దీంతో ప్రధానంగా బాలికలు మరుగుదొడ్డికి వెళ్లడానికి పలు పాఠశాలల్లో అవస్థ పడుతున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు పేరుతో అనేక పాఠశాలల్లో మరుగుదొడ్లని నిర్మించారు. అయితే వాటికి అవసరం అయిన నీటి వసతులు ఏర్పాటు చేసుకుని సద్వినియోగం చేసుకోవాల్సి ఉన్నా, పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో ఆడబిడ్డలకు అగచాట్లు తప్పడం లేదు.

పాఠశాలలో నిరూపయోగంగా ఉన్న మరుగుదొడ్లు

మహిళా దినోత్సవానికి

ప్రతి స్కూలులో మరుగుదొడ్డి

80 శాతం స్కూళ్లలో నిబంధనలు తూచ్‌

సాధారణంగా 30 మంది పిల్లలుంటే ఒక మరుగుదొడ్డి యూనిట్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే 80 శాతం పాఠశాలల్లో ఆ నిబంధన పాటించడం లేదు. ఉదాహరణకు 210 మంది పిల్లలు ఉంటే ఏడు యూనిట్లు(ఒక యూనిట్‌ అంటే మరుగుదొడ్ల సమూహం)ఉండాలి. అయితే కేవలం ఒక యూనిట్‌ మరు గుదొడ్డి మాత్రమే ఉన్న పాఠశాలలు 60 శాతంపైగా నే ఉన్నాయి. విద్య,ఆరోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన కూటమి ప్రభుత్వం నిధులు కొరత అంటూ పాఠశాలల్లో కనీసం మరుగుదొడ్లను ఏర్పాటు చేయకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement