శ్రీవారి దర్శనానికి 12 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

Mar 10 2026 7:09 AM | Updated on Mar 10 2026 7:09 AM

తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 77,879 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,520 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.19 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 75 అర్జీలు

తిరుపతి క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 75 ఫిర్యాదులు అందినట్టు ఏఎస్పీలు శ్రీనివాసులు, రవి మనోహరాచారి తెలిపారు. ఇందులో చోరీలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ బ్యానర్‌ ఆవిష్కరణ

తిరుపతి అర్బన్‌: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 14 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖ క్యాన్సర్‌ నివారణకు అందించనున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్‌కు సంబంధించిన బ్యానర్‌ను కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వి బాలకృష్ణ నాయక్‌; డాక్ట ర్‌ శాంతకుమారి, డాక్టర్‌ మధు పాల్గొన్నారు.

విద్యుత్‌ సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు

తిరుపతి రూరల్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌ ఆ సంస్థ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం సోమ వారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమానికి 52 వినతులు అందినట్లు తెలిపారు. తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో ప్రతి సోమ వారం నిర్వహించే ఈ కార్యక్రమంలో 9 జిల్లాల నుంచి వచ్చిన వినియోగదారులు విద్యుత్‌ సమస్యలను ఆయా జిల్లాల అధికారులకు చేరవేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్‌ ఖాన్‌, కె.రామమోహన్‌ రావు, చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు జె.రమణా దేవి, కె.ఆదిశేషయ్య, ఎం.ఉమాపతి, ఎం.మురళీ కుమార్‌, సీహెచ్‌ రామచంద్ర రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement