తిరుపతి రూరల్: కళా సంస్కృతి, భాష.. రెండు వేరు కాదని, భాషకి కళ ఆత్మ వంటిదని సీఎస్‌టీటీ సహాయ సంచాలకులు దీప్‌కుమార్ అన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తెలుగు అధ్యయన శాఖ, న్యూఢిల్లీ శాస్త్ర వైజ్ఞానిక పరిభాషా కమిషన్, ఉన్నత విద్యా మంత్రిత్వశాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ‘త్రిభాషా సమాచార సాంకేతిక పదకోశం – నిపుణుల సలహా సంఘం’ అనే అంశంపై నిర్వహించిన సమీక్ష సమావేశం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి న్యూఢిల్లీలోని సీఎస్‌టీటీ సహాయ సంచాలకులు దీప్‌కుమార్ ముఖ్యతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంతర్జాలంలోని వెబ్‌సైట్‌లో shabd.education.gov.in ఏ భాషలోనైనా శాస్త్ర పదాలను తీసుకోవచ్చన్నారు. అంతకు ముందు తెలుగు శాఖాధ్యక్షురాలు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి మాట్లాడుతూ ఆధునిక యుగంలో సాంకేతికత ముందంజగా సాగుతోందని, భిన్న భాషల్లో ఉన్న విజ్ఞానాన్ని అనువదించి, మాతృభాషలో అధ్యయనం చేయడంతో మరింత జ్ఞానం సంపాదించవచ్చన్నారు. ఆచార్య సి.వాణి మాట్లాడుతూ తెలుగు అధ్యయన శాఖ తరఫున రూ.పది లక్షలు అనువాదాల కోసమే కేటాయించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ద్రావిడ విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య కేశవమూర్తి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టర్ రఘు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ భుజంగారెడ్డి, శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ముత్తులక్ష్మి, డాక్టర్ సరిత, డాక్టర్ వై.సుభాషిణి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ నాగలక్ష్మి, పీజీ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు పాల్గొన్నారు.


