– జిల్లావ్యాప్తంగా ’కార్డన్‌సెర్చ్’
తిరుపతి క్రైం : జిల్లావ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీస్ శాఖ కదిలింది. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజాము నుంచే జిల్లాలోని అన్ని సబ్‌డివిజన్లలో పోలీసులు ఏకకాలంలో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. అందులో భాగంగా తిరుపతి పరిధిలో పలు ప్రాంతాలు ముమ్మరంగా తనిఖీ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికుల గుర్తింపు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. తనిఖీల అనంతరం శాంతిభద్రతల కాపాడతామని ప్రజలందరితో కలిసి పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, హెల్మెట్ ధరించాలని వాహనచోదకులకు ఈ సందర్భంగా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.


