ట్రాన్స్‌జెండర్లే ఆ యువకుడిని చంపేశారు | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌జెండర్లే ఆ యువకుడిని చంపేశారు

Mar 8 2026 7:16 AM | Updated on Mar 8 2026 7:16 AM

● బంగారు గొలుసు కోసమే హత్య ● ఏడుగురు ట్రాన్స్‌జెండర్ల అరెస్టు

నాయుడుపేట టౌన్‌ : బంగారు గొలుసు కోసమే ట్రాన్స్‌జెండర్లు ఓ యువకుడిని కిరాతకంగా కొట్టి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని నాయుడుపేట డీఎస్పీ జీ.చెంచుబాబు వెల్లడించారు. పట్టణంలోని పోలీస్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో శనివారం అర్బన్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ బ్రహ్మనాయుడుతో కలిసి డీఎస్పీ చెంచుబాబు విలేకరుల సమావేశంలో యువకుడి హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నాయుడుపేట ముస్లిం వీధికి చెందిన షేక్‌ హుస్సేన్‌ను గత 24వ తేదీన కొంతమంది ట్రాన్స్‌జెండర్లు కిడ్నాప్‌ చేసి తీసుకువెళ్లారని అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు. ఈ నేపథ్యంలో పండ్లూరు సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం లభించింది. హుస్సేన్‌ కుటుంబ సభ్యులు గూడూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని చూసి హుస్సేన్‌దిగా గుర్తించారు. అనంతరం నాయుడుపేట పోలీసులు కేసును రైల్వే పోలీసుల నుంచి బదలాయించుకుని హత్య కేసుగా నమోదుచేసి దర్యాప్తు చేశారు. నాయుడుపేట మండలంలోని చిలమత్తూరు గ్రామానికి చెందిన రాయపు హరి అలియాస్‌ భానునాయక్‌, రాయపు సుధీర్‌ అలియాస్‌ భావన, సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన సాకే మంజునాథ అలియాస్‌ సద, ఓజిలి మండలం అచర్ల పార్లపల్లికి చెందిన డేరంగుల అనిల్‌ అలియాస్‌ అశ్విని, సత్యసాయి జిల్లా ముదిగుబ్బకు చెందిన కానం గంగాధర్‌ అలియాస్‌ గంగ, శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన షేక్‌ హుస్సేన్‌ అలియాస్‌ మైనా, మూరతొట్టి కుమార్‌ అలియాస్‌ భవాని అనే ఏడుగురు ట్రాన్స్‌జెండర్లు నాయుడుపేటలోని విన్నమాల రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో హుస్సేన్‌ను నిర్బంధించారు. మద్యం సేవించి బంగారు చైను ఎక్కడ పెట్టావో చెప్పమని హుస్సేన్‌ను కాళ్లు చేతులు చున్నీలతో కట్టేసి ప్లాస్టిక్‌ పైపుతో దాడి చేయడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించేలా ప్రధాన నిందితురాలు భానునాయక్‌, మరో ట్రాన్స్‌జెండర్‌ కలిసి స్కూటీలో హుస్సేన్‌ శవాన్ని 25వ తేదీ అర్ధరాత్రి సమయంలో పండ్లూరు గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై పడేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం రాత్రి విన్నమాల సచివాలయం వద్ద ఏడుగురు ట్రాన్స్‌జెండర్లను అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెంచుబాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement