తిరుపతి క్రైం : నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్డుపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ రామదాసు కాలనీకి చెందిన జే. గంగిరెడ్డి (50) శనివారం సాయంత్రం ఆటోలో లక్ష్మీపురం సర్కిల్ నుంచి అన్నమయ్య సర్కిల్ వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో ఎయిర్ బైపాస్ రోడ్డులోని రోబో రెస్టారెంట్ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద వెళుతుండగా ముందుగా వెళుతున్న గుర్తు తెలియని వాహనం డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న ఆటో ఆ వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో గంగిరెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఈస్ట్ సీఐ శ్రీనివాసులు తెలిపారు.


