తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో వైఎస్సార్ కడప జిల్లా, బద్వేలు మండలం, వీరపల్లి పంచాయతీ, వెంకటాద్రి నగర్‌కు చెందిన అద్దూరి యాదగిరికి ఐదేళ్లు జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. 2019 మే 23వ తేదీ బద్వేలు రేంజ్ ఫారెస్ట్ అధికారులు లంకమల్ల రిజర్వ్ ఫారెస్ట్, బద్వేలు రేంజ్, బాలయ్యపల్లి బీట్, మేదరపాళెం అటవీ ప్రాంతంలో తనిఖీలు చేశారు. నిందితుడు యాదగిరితో పాటు మరో నలుగురు అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరికి దుంగలుగా మార్చి తరలించడానికి ప్రయత్నిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది వారి వెంట పడ్డారు. అయితే నలుగురు వ్యక్తులు పరారీ కాగా నిందితుడు యాదగిరిని మాత్రం అరెస్టు చేశారు. అతని వద్ద 133 కిలోల ఐదు ఎర్రచందనం దుంగలను ఫారెస్ట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు యాదగిరిని ఫారెస్ట్ సిబ్బంది కోర్టులో హాజరుపరచగా అతనిపై నేరం రుజువైంది. దీంతో న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.


