తడ: పులికాట్ సరస్సులో ఆంధ్ర, తమిళ జాలర్ల మధ్య తరచూ నెలకొంటున్న వివాదానికి కారణమైన ప్రాంతాన్ని రెండు రాష్ట్రాలకు చెందిన డివిజన్ స్థాయి అధికారులు శుక్రవారం పరిశీలించారు. సరస్సులో వేట సాగించే సమయంలో తమిళ జాలర్లు అడ్డుకోవడంతోపాటు దాడులకు దిగుతున్నారని జాలర్లు గతంలో పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు విన్నవించారు. తాజాగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌కి సమస్యను తెలపడంతో ఆయన సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారం కోసం ఇటీవల తమిళనాడు అధికారులతో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించారు. తమిళనాడులో ఎన్నికల హడావుడి కొనసాగుతున్నందున ఎన్నికలు ముగిశాక పరిష్కారం కోసం సమావేశం అవుదామని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో చర్చలు మొదలయ్యే నాటికి సరస్సులో ఉన్న పరిస్థితులను పరిశీలించి నివేదిక తయారు చేయాలని డివిజన్ స్థాయి అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు సూళ్లూరుపేట ఆర్టీఓ దేవేందర్‌రెడ్డి, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, సీఐ మురళీకృష్ణ, ఎఫ్‌డీఓ రమణయ్య, తహసీల్దార్ రవికుమార్, బెస్త కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్‌తోపాటు ఇరురాష్ట్రాల మత్స్య, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు, ఫిషరీస్ అసోసియేషన్ నాయకులు పులికాట్‌ను సందర్శించి, సమస్యలు గుర్తించారు.


