రేణిగుంట: మండలంలోని వెంకటాపురం పంచాయతీ, అన్నాస్వామిపల్లి చెరువులో నాలుగు రోజులుగా అధికార పార్టీ నాయకులు జేసీబీతో మట్టి అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. మండల తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే అక్రమ తవ్వకాలు జరుగుతున్న అధికారులు ఎవరు అటువైపు వెళ్లకపోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. స్థానికులు అడుగుతుంటే అధికారుల అనుమతితోనే తవ్వకాలు జరుపుతున్నామని అంటున్నారని స్థానికులు వాపోతున్నారు. చెరువులో ఇష్టనుసారంగా మట్టి తవ్వేదానికి అధికారులు ఏ విధంగా అనుమతులు ఇస్తారని, అనుమతులు ఇచ్చారా? లేక అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి అటువైపు వెళ్లకుండా ఉన్నారా? అనేది అంతు పట్టని ప్రశ్నగా మారింది. చెరువులో ఇష్టానుసారంగా గుంతలు లోడడంతో చెరువు నిండినప్పుడు పశువులు, మనుషులకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి అక్రమ మట్టి తవ్వకాలను నిలుపుదల చేయాలని కోరుతున్నారు.


