గిరిజనుడి రేకులిల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

గిరిజనుడి రేకులిల్లు దగ్ధం

Mar 6 2026 8:04 AM | Updated on Mar 6 2026 8:04 AM

తడ: పొట్ట కూటి కోసం పనికి వెళ్లిన గిరిజనుడు ఇల్లు తిరిగి వచ్చి చూసే సరికి కాలి బూడిదైంది. ఈ ఘటన గురువారం తడ మండలం చేనిగుంట గిరిజన కాలనీలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడు ఈటిపాకుల నాగార్జున కథనం మేరకు.. కాలనీలో రేకుల ఇంట్లో నివసిస్తున్న నాగార్జున కుటుంబ సభ్యులు రోజులాగే ఇంటి తలుపులు వేసుకుని పనికి వెళ్లారు. మధ్యాహ్న సమయానికి ఇంట్లో నుంచి పొగలు వస్తుండడంతో ఇరుగు పొరుగు వాళ్లు తలుపులు తీసే ప్రయత్నం చేసినా తాళాలు వేసి ఉంటడంతో మంటలు ఆర్పేందుకు వీలుకాలేదు. ఫోను ద్వారా బాధితునికి సమాచారం చేరవేయగా నాగార్జున ఇంటికి వచ్చేసరికి లోపల ఉన్న వస్తువులు మొత్తం కాలిపోయాయి. ఇంట్లోని టీవీ, మంచం, బట్టలు, బియ్యం, నిత్యావసరాలు మొత్తం కాలిపోవడంతో కట్టుబట్టలు మాత్రమే మిగిలాయి. నిరుపేద అయిన బాధితుడికి ప్రభుత్వం సత్వర సాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఉరివేసుకుని విద్యార్థి మృతి

చంద్రగిరి: ఉరి వేసుకుని విద్యార్థి మృతి చెందిన ఘటన మండలంలోని రామిరెడ్డిపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వైఎస్సార్‌ కడప జిల్లా బాబా సాహెబ్‌పేట, బాలుపల్లికి చెందిన రామానుజరెడ్డి కుమారుడు బొమ్మేపల్లి హర్షవర్ధన్‌ రెడ్డి(21) ఏ.రంగంపేట సమీపంలోని ఎంబీయూ యూనివర్సిటీలో బిటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. గురువారం సాయంత్రం కళాశాల నుంచి వచ్చిన హర్షవర్ధన్‌రెడ్డి, రామిరెడ్డిపల్లిలోని అద్దెకు ఉంటున్న గదికి వెళ్లాడు. తోటి స్నేహితులు తర్వాత వచ్చి తలుపులు కొట్టినా తీయకపోవడంతో ఇంటి యజమాని సుబ్రమణ్యం యాదవ్‌కు సమాచారం అందజేశారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి చూడగా హర్షవర్ధన్‌ రెడ్డి ఉరి వేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ అరుణాచలం ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement