జర్నలిస్టుపై పార్కింగ్ సిబ్బంది దాడి
చంద్రగిరి: తిరుచానూరులో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించిన సీనియర్ జర్నలిస్టు, అమ్మవారి భక్తుడు మునిరామిరెడ్డిపై గురువారం పోలీసులు, పంచాయతీ అధికారుల ఎదుటనే దాడి జరిగింది. వివరాల్లోకెళితే.. తిరుచానూరు పార్కింగ్ సిబ్బంది గత కొంత కాలంగా కూటమి నేతల అండతో విచ్చలవిడిగా భక్తులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వాహనాల పార్కింగ్‌కు అధిక రుసుము వసూలు చేస్తున్న విషయంపై ప్రశ్నించి భక్తులపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే జర్నలిస్టు మునిరామిరెడ్డి గురువారం అధిక రుసుము వసూలును ప్రశ్నించిన భక్తులపై పార్కింగ్ సిబ్బంది దౌర్జన్యం చేస్తున్నట్లు తెలుసుకున్నాడు. దీంతో ఘటన స్థలానికి చేరుకుని పార్కింగ్ సిబ్బంది ఆగడాలను చిత్రీకరించాడు. ఈ క్రమంలో ప్రైవేటు పార్కింగ్‌కు చెందిన సిబ్బందితోపాటు టీడీపీ గుండాలు మునిరామిరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. పంచాయతీ కార్యదర్శి, పోలీసుల సమక్షంలో దాడి జరిగిన వారు చోద్యం చూస్తుండడంపై స్థానికులు మండిపడుతున్నారు. కాగా బాధితుడు మునిరామిరెడ్డి, బీజేపీ మహిళా మోర్చా మండల నాయకురాలు పుష్పారెడ్డితో కలసి తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


