ఆకలితో అలసి.. సొలసి!
తిరుపతి సిటీ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలను మెరుగుపరిచేందుకు వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు.దీంతో పది విద్యార్థులకు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం గంట నుంచి గంటన్నర పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. నిత్యం స్లిప్ టెస్ట్‌లు చేపట్టి విద్యార్థుల మార్కులను యాప్‌లో అప్‌లోడ్ చేయడమే ఈ వందరోజుల ప్రణాళిక లక్ష్యం. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ.. జిల్లావ్యాప్తంగా సర్కారు బడుల్లో సుమారు 22వేల మంది పదోతరగతి విద్యార్థులు ఉన్నారు. వీరందరూ ఆకలితో అలమటిస్తూ చదువుకోవాల్సిన దుస్థితి దాపురించింది. వందరోజుల ప్రణాళికలో భాగంగా వీరు పాఠశాలకు ఉదయం 8గంటలకు చేరుకోవాల్సి ఉంది. అలాగే సాయంత్రం ఆరు గంటల వరకు ప్రత్యేక తరగతులు ఉంటాయి. పొద్దుపొద్దునే అల్పాహారంతో బడికి బయలు దేరిన పిల్లలకు మధ్యాహ్నం భుజించే ఆహారమే దిక్కు. దీంతో సాయంత్రం 7గంటలకు ఇంటికి చేరేవరకు కనీసం మంచినీళ్లు తప్ప ఎటువంటి ఆహారం ఉండదు. ఈ క్రమంలో చాలా మంది విద్యార్థులు నీరసించి పోతున్నారు. కొందరు తల్లిదండ్రులను సమాచారం అందించి మధ్యలోనే ఇంటికి వెళ్లిపోతున్నారు.
కనిపించని శ్రద్ధ
సర్కారు బడుల్లోని పది విద్యార్థులకు స్పెషల్ తరగతులు నిర్వహిస్తున్న అధికారులు కనీసం సాయంత్రం సమయంలో పిల్లలకు స్నాక్స్ అందించాలనే ఆలోచన చేయకపోవడం దారుణమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించాలనే ఉద్దేశం మంచిదే అయినప్పటికీ పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. స్పెషల్ క్లాస్‌కు వచ్చిన వారికి పాలు, బిస్కెట్లు వంటివి అందిస్తే ఆకలితో అలమటించాల్సిన అవస్థ తప్పుతుందని సూచిస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఉపాధ్యాయులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక తరగతులు ముగిసే సరికి విద్యార్థులు అలసిపోతున్నారని వెల్లడిస్తున్నారు. ఆకలి కారణంగా పాఠాలను సైతం వినేందుకు చాలామంది ఆసక్తి చూపడం లేదని వివరిస్తున్నారు. సాయంత్రం ఏమైనా స్నాక్స్ అందించగలిగితే విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో చదువుకుంటారని సూచిస్తున్నారు.


