మన లక్ష్యం.. రైల్వే డివిజన్
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వేడివిజన్ ఏర్పాటునే లక్ష్యంగా ముందుకు సాగుదామని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతి నగరంలో ఆటో, ద్విచక్రవాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్ధానిక తారకరామ స్టేడియం నుంచి బయలుదేరిన ర్యాలీ బాఆజీనగర్, వెస్ట్ చర్చి, ఎమ్మార్‌పల్లె, అన్నమయ్య, లక్ష్మీపురం, రామానుజ సర్కిల్ మీదుగా రైల్వేస్టేషన్ వద్దకు సాగింది. గిరిధర్‌కుమార్ మాట్లాడుతూ బాలాజీ రైల్వే డివిజన్‌గా ప్రకటించాలని మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే పలువురు నాయకులను కలసి వినతిపత్రాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రులను కలసి డివిజన్ అవశ్యకతను వివరించినట్లు తెలిపారు. సాధన సమితి అధ్యక్షుడు ఎం.వేణుగోపాల్ రెడ్డి, చాంబర్ అఫ్ కామర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీ చౌదరి, సూరినేని బుజ్జి బాబు నాయుడు, కె.కళాదర్, కృష్ణయ్య, సీఆర్‌కే శేషగిరి రావు, కృష్ణమూర్తి, కార్మిక నేతలు యు.ప్రసాద్ రావు, మునీశ్వర్ రెడ్డి, టీవీ రావ్ పాల్గొన్నారు.
వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక బస్సులు
తిరుపతి అర్బన్: వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో తిరుపతి బస్టాండ్ నుంచి అప్పలాయగుంట ఆలయానికి, శ్రీనివాసమంగాపురానికి ఐదేసి సర్వీసుల చొప్పున ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ విశ్వనాధం ఆదివారం తెలిపారు. సోమవారం నుంచి బుధవారం వరకు ఇవి నడుస్తాయన్నారు.


