పది మంది ఉంటే ఈఎస్‌ఐ తప్పనిసరి
తిరుపతి సిటీ: దుకాణాలు, వాణిజ్య సంస్థలు, రెస్టారెంట్లు, లాడ్జిలు, హోటళ్లు, ఫ్యాక్టరీలు, పాఠశాలలు, కళాశాలలు మొదలైన వాటిలో 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది పనిచేస్తుంటే ఆయా సంస్థలు తప్పనిసరిగా కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) పరిధిలోకి వస్తాయని ఈఎస్‌ఐసీ అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం తిరుపతి జీవకోనలోని విశ్వం హైస్కూల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అర్హత కలిగిన దుకాణాలు, సంస్థలు వెంటనే శ్రమ సువిధ, ఈఎస్‌ఐసీ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్‌పీఆర్‌ఈఈ పథకం ద్వారా అర్హత కలిగిన సంస్థలు ఈనెల 31వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే, గత కాలానికి సంబంధించిన బకాయిలు, పరిశీలనలు, జరిమానాలు ఉండవని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా బీమా చేయబడిన కార్మికుల, వారి కుటుంబ సభ్యులు ఉచిత వైద్య సేవలు, ప్రమాద బీమా, వికలాంగ భద్రత, ప్రసూతి ప్రయోజనాలు సహా పలు సామాజిక సంక్షేమ పథకాల లబ్ధి పొందవచ్చని వివరించారు. కార్యక్రమంలో సామాజిక భద్రతాధికారి ఎల్.వేణుగోపాల్, ఈఎస్‌ఐసీ తిరుపతి బ్రాంచ్ మేనేజర్ సి.నాగమణి, అపుస్మా రాయలసీమ జోన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.విశ్వనాధ రెడ్డి పాల్గొన్నారు.
చంద్రగిరిలో సైబర్ మోసం
చంద్రగిరి : సైబర్ మోసానికి ఓ వ్యాపారవేత్త బలైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పట్టణానికి చెందిన ఓ వ్యాపారవేత్తకు సైబర్ మోసగాళ్లు ఆదివారం ఫోన్ చేశారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టారని, డెలివరీ పూర్తయ్యిందని చెప్పి బాధితుడిని నమ్మించారు. డెలివరీ నిర్ధారణ కోసం ఓటీపీ చెప్పాలని కోరారు. దీంతో సదరు వ్యాపారవేత్త ఓటీపీ వివరాలు వెల్లడించగా, నిమిషాల వ్యవధిలోనే బాధితుడి ఖాతా నుంచి రూ.4 లక్షలు మాయమయ్యాయి. జరిగిన మోసం గుర్తించిన బాధితుడు వెంటనే చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును సైబర్ క్రైమ్‌కు బదిలీ చేసి దర్యాప్తు ప్రారంభించారు.


