ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ సభ్యుడిగా అంకయ్య
శ్రీకాళహస్తి : ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ సభ్యుడిగా శ్రీకాళహస్తికి చెందిన కేసీ అంకయ్యను ఎంపిక చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో (ఐలు) ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ యూనియన్ కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో ఈనెల 8వ తేదీన జిల్లా కమిటీని రద్దు చేశారు. దీని స్థానంలో తిరుపతి నుంచి పత్తికొండ మురళి, హేమ చంద్రారెడ్డి, చల్లా వెంకటయ్య, భాను సుందర్, చిత్తూరు నుంచి సుగుణ శేఖర్‌రెడ్డి, మదనపల్లి నుంచి షాజహాన్ బాషా, పీవీ ప్రసాద్, సోమశేఖర్, శ్రీకాళహస్తి నుంచి కాకి చిన్న అంకయ్య తదితర 9 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు.
నెలనెలా పింఛన్ల కోత
తిరుపతి అర్బన్: సామాజిక భద్రతా పింఛన్లు చంద్రబాబు పాలనలో ప్రతినెలా తగ్గిపోతున్నాయి. 19 నెలల కాలంలో జిల్లా వ్యాప్తంగా 14,544 పింఛన్లు తగ్గాయి. గత నెలలో 2,62,108 మందికి పింఛన్లు పంపిణీ చేస్తే...ఈ నెలలో 2,61,543 మందికి ఈ నెల 31న పంపిణీ చేయనున్నారు. గత నెలతో పోల్చుకుంటే జిల్లాలో 565 పింఛన్లు తగ్గాయి. మరోవైపు మూడు నెలల క్రితం 7,543 మంది దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులకు నోటీసులు ఇచ్చి కొందరి పింఛన్ల తొలగించారు. మరి కొందరి పింఛన్ల తగ్గింపు చేస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో వారంతా తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున రోడ్డెక్కి పోరాటం చేయడంతో రీవెరిఫికేషన్ అంటూ కాలయాపన చేస్తున్న విషయం విదితమే. రీవెరిఫికేషన్ అనంతరం తమ పింఛన్ల తొలగిస్తే మరోసారి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వాళ్లు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు భర్త ఫించన్ తీసుకుంటూ మృతి చెందిన 472 కుటుంబాల్లో వాళ్ల భార్యకు స్పౌజ్ పేరుతో పింఛన్లు ఇస్తున్నారు. అంతకు మించి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయలేదు. కనీసం పింఛన్లకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఇప్పటివరకు కల్పించలేదు. దీంతో జిల్లాలో వితంతువులే దాదాపుగా 5 వేల మందికిపైగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే వృద్ధులు 14 వేల మంది, వ్యాధిగ్రస్తులు మరో 6 వేల మంది, ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే దరఖాస్తు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పింఛన్లు ఇస్తామని చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల సమయంలో చెప్పిన సంగతి తెలిసిందే. వారికి దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో అలాంటి వారు 70వేల మంది వరకు ఉన్నారు. మొత్తంగా చూస్తే లక్ష మంది తిరుపతి జిల్లాలో కొత్త పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.


