కబ్జాల రాజ్యం! | - | Sakshi
Sakshi News home page

కబ్జాల రాజ్యం!

Dec 15 2025 10:24 AM | Updated on Dec 15 2025 10:24 AM

కబ్జా

కబ్జాల రాజ్యం!

కొనసాగుతున్న పచ్చమూక ఆక్రమణలు

తాజాగా రూ.6కోట్ల మఠం భూమి హాం ఫట్‌

అక్రమార్కులకు అండగా నిలిచిన ఖాకీలు

యథేచ్ఛగా ప్రహరీ గోడ నిర్మాణం

అడ్డుకోబోయిన స్థానికులపై దౌర్జన్యం

ఖాళీ భూమి కనిపిస్తే చాలు.. పచ్చమూక రెచ్చిపోతోంది. ఇష్టారాజ్యంగా కబ్జాలకు పాల్పడుతోంది. అధికారుల అండతో యథేచ్ఛగా ఆక్రమణల పర్వం కొనసాగిస్తోంది. అందులో భాగంగా హథీరామ్‌జీ మఠానికి చెందిన రూ.6కోట్ల విలువైన స్థలంపై కన్నేసింది. నకిలీ పత్రాలను సృష్టించి కబళించేందుకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో ముందుగా ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టింది. అడ్డుకునేందుకు యత్నించిన స్థానికులపై ఖాకీల సాయంతో దౌర్జన్యానికి తెగబడింది.

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌ : తిరుపతి రూరల్‌ మండలం గాంధీపురం పంచాయతీ పరిధిలోని అవిలాల గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 13లో ఉన్న ఎకరా మఠం భూమిపై టీడీపీ నేతలు కన్నేశారు. ఆ భూమిని 2014లోనే వైఎస్సార్‌ కడపజిల్లా రైల్వేకోడూరుకు చెందిన రామసుబ్బారెడ్డి పేరిట రిజిస్టర్‌ జరిగినట్టు ఓ డాక్యుమెంట్‌ను తీసుకువచ్చారు. ఆ భూమిని ఎంతో కాలంగా కాపాడుకుంటూ వచ్చిన తమను నిర్ధాక్షిణ్యంగా తరిమేశారని స్థానిక రజకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు ఈ భూమిని కబ్జా చేయాలని చాలా మంది ప్రయత్నించినా అడ్డుకున్నామని, అయితే టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారని మండిపడుతున్నారు. కాపాడాల్సిన పోలీసులు సైతం అక్రమార్కులకే వంత పాడారని వాపోతున్నారు.

రిజిస్ట్రేషన్‌ ఎలా..?

మఠం భూమిని ఎవరు రిజిస్ట్రేషన్‌ చేశారో అంతుపట్టడం లేదని స్థానికులు వెల్లడిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మఠం భూములను రిజిస్ట్రేషన్‌ చేయరని స్పష్టం చేస్తున్నారు. నిజంగా ఆ రిజిస్ట్రేషన్‌ సక్రమమే అయితే ఇంత కాలంగా ఆ భూమిలోకి ఎందుకు ప్రవేశించలేదో చెప్పాలని నిలదీస్తున్నారు. నిజానికి రామసుబ్బా రెడ్డి పేరిట వున్న రిజిస్టర్‌ డాక్యుమెంట్‌లో రాసిన భూమికి హద్దులు కూడా లేవని చెబుతున్నారు., సర్వే నంబరు 13లోని 105 ఎకరాల విస్తీర్ణంలో ఆ భూమి ఎక్కడుందో కూడా తెలియదన్నారు. ప్రభుత్వం కనికరిస్తే ఈ భూమిలో చిన్నపాటి గూడు కట్టుకుందామని ఆశిస్తే.. టీడీపీ నేతలు కబ్జా చేసేశారని ఆవేదన చెందుతున్నారు.

కన్నెత్తి చూడని అధికారులు

తిరుపతి శివారులో బాలాజీ డెయిరీకి వెనుక జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ భూమి విలువ సుమారు రూ.6కోట్లు ఉంటుంది. ఇంతటి విలువైన భూమిని అడ్డగోలుగా ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మిస్తున్నా రెవెన్యూ అధికారులే కాకుండా, మఠం అధికారులు కూడా కన్నెత్తి చూడడం లేదని ఆరోపిస్తున్నారు. పేదలు జానెడు జాగాలో గుడిసె వేసుకుంటే వెంటనే వచ్చి నేలమట్టం చేసే మఠం అధికారులు రూ.కోట్లు విలువైన భూమికి ప్రహరీ కడుతుంటే ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు.కళ్ల ముందే భూములు అన్యాక్రాంతం అవుతున్నా అడ్డుచెప్పడం లేదని మండిపడుతున్నారు.

భయపెడతున్న ఖాకీలు

మఠం భూమిని ఆక్రమిస్తున్న టీడీపీ నేతలకు పోలీసులే వెన్నుదన్నుగా నిలబడ్డారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అడ్డుకునేందుకు వెళితే కేసులు పెడతామని భయాందోళనకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. ఈ విషయంలో కలెక్టర్‌, ఎస్పీ జోక్యం చేసుకుని పేదలకు న్యాయమ చేయాలని కోరుతున్నారు. స్థానిక ముఖ్య ప్రజాప్రతినిది అండతోనే ఆక్రమణదారులు అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు సైతం ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

ఐదు నెలల క్రితమే..

మఠం భూమి ఆక్రమణకు ఐదు నెలల క్రితమే రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. చంద్రగిరి మండలానికి చెందిన టీడీపీ నేత ఆగస్టు 4వ తేదీన ఆ భూమిలో చదును పనులు చేపట్టారు. ఆ సమయంలో పెద్దసంఖ్యలో చేరుకుని పనులను అడ్డుకున్నారు. అప్పటి ఘటనను అన్ని పత్రికలు ప్రచురించాయి. దీంతో పోలీసులు, మఠం అధికారులు సైతం వచ్చి ఆ భూమిలో ఎవరూ ప్రవేశించకూడదని హెచ్చరించారు. తర్వాత ఆక్రమణకు యత్నించిన టీడీపీ నేత అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో టీడీపీకి చెందిన మరికొందరు నేతలు రంగంలోకి దిగారు. చంద్రగిరి నియోజకవర్గ ముఖ్యనేత అండదండతో కబ్జాకు శ్రీకారం చుట్టినట్టు స్థానికులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఒకప్పుడు భూమి చదును పనులను అడ్డుకున్న పోలీసులు, మఠం అధికారులు, ఇప్పుడు ప్రహరీ గోడ నిర్మాణానికి కాపు కాస్తున్నారని వివరిస్తున్నారు. ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడిస్తున్నారు.

కబ్జాల రాజ్యం!1
1/1

కబ్జాల రాజ్యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement