సాంకేతిక సౌధంలో క్రీడా సంబరం
ఏర్పేడు : భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ (ఐఐటీ) 58వ ఇంటర్ స్పోర్ట్స్ మీట్ ఆదివారం ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ మైదానంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ ఆధ్వరంయలో భారత ఒలింపిక్ వెయిట్‌లిప్టింగ్ క్రీడాకారుడు సతీష్ శివలింగం పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. తిరుపతి ఐఐటీలో వెయిట్ లిఫ్టింగ్(పురుషులు), టెన్నిస్(పురుషులు, మహిళలు), చెస్(మిక్స్‌డ్) పోటీలు ఈనెల 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ముందుగా క్రీడా జ్యోతిని వెలిగించి, స్పోర్ట్స్‌మీట్ మస్కట్ ‘తేజస్’ను ఆవిష్కరించారు. దేశంలోని వివిధ ఐఐటీల నుంచి వచ్చిన క్రీడాకారులు గ్రౌండ్‌లో మార్చ్‌ఫాస్ట్ చేపట్టారు. ముఖ్య అతిథి సతీష్ శివలింగం మాట్లాడుతూ తాను వేలూరు సమీపంలోని ఓ పల్లెటూరులో జన్మించానని, 15ఏళ్ల వయసులో తండ్రి సూచన మేరకు వెయిట్‌లిఫ్టింగ్‌ను ఎంచుకున్నానని తెలిపారు. అప్పట్లో వెయిట్‌లిఫ్టింగ్‌కు పనికిరానని వెనక్కి నెట్టే ప్రయత్నం చేశారన్నారు. అప్పుడే తాను ప్రపంచస్థాయిలో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రాణించాలని లక్ష్యం పెట్టుకుని కఠోర శ్రమతో అంచెలంచెలుగా ఎదిగి కామన్వెల్త్ గేమ్స్‌లో రాణించి బంగారు మెడల్‌ను అందుకున్నానని వివరించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో మన దేశం తరఫున ఆడానన్నారు. 2036 ఒలింపిక్ గేమ్స్ మన దేశంలో జరిగే అవకాశాలున్నాయని, ఇప్పటి వరకు ఒలింపిక్ క్రీడల్లో మన క్రీడాకారులు కేవలం రెండు బంగారు పతకాలను సాధించి అట్టడుగు స్థానంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 2018 నుంచి ఖేలో ఇండియా పేరుతో ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ ప్రతిభ ఉన్న క్రీడాకారులకు గుర్తింపునిస్తోందని వెల్లడించారు. ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ తిరుపతి ఐఐటీతోపాటు హైదరాబద్, మద్రాస్ ఐఐటీలలో జరుగుతున్న ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్‌ను కేవలం క్రీడా పోటీలుగా తాను భావించడం లేదని తెలిపారు. ఐఐటీల స్నేహం, అనుబంధాల సమ్మేళనానికి ఈ స్పోర్ట్స్ మీట్ తార్కాణంగా నిలుస్తుందని వివరించారు. . క్రీడల్లో రాణించాలంటే పట్టుదలతోపాటు క్రమశిక్షణ అవసరమన్నారు. వివిధ ఐఐటీల నుంచి వచ్చిన విద్యార్థులందరూ క్రీడాస్ఫూర్తిని పాటించి ప్రతిభను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
ప్రారంభ వేడుకల్లో భాగంగా తిరుపతికి చెందిన సైనిక్ స్కూల్ విద్యార్థుల ప్రదర్శన వీక్షకులను కట్టిపడేసింది. అలాగే కర్రసాము, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
సాంకేతిక సౌధంలో క్రీడా సంబరం
సాంకేతిక సౌధంలో క్రీడా సంబరం
సాంకేతిక సౌధంలో క్రీడా సంబరం


