సమయపాలన తప్పనిసరి
– నేడు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్
తిరుపతి అర్బన్ : ప్రజాసమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న పీజీఆర్‌ఎస్ (గ్రీవెన్స్)కు అధికారులు తప్పనిసరిగా సమయ పాలన పాటిస్తూ హాజరుకావాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వినతులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని అన్ని శాఖ ఉద్యోగులు వందశాతం హాజరుకావాలని స్పష్టం చేశారు. ఆయా విభాగాలకు అర్జీలు రాకపోయినప్పటికీ గ్రీవెన్స్ ఆరంభం నుంచి పూర్తయ్యే వరకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రతి వినతికీ పరిష్కారం చూపించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అర్జీ పరిష్కారం కాకపోయినా పరిష్కరించినట్లు లెక్కలు చూపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే అర్జీదారులకు అవసరాలకు అనుగుణంగా వసతులు కల్పించాలని కోరారు. కుర్చీల ఏర్పాటు, తాగునీరు, మరుగుదొడ్ల పరిశుభ్రతపై దృష్టి సారించాలని తెలిపారు. వీఆర్వోలు అర్జీలను రాసి ఇచ్చేందుకు తప్పకుండా హజరుకావాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే అర్జీదారులు మీ కోసం కాల్ సెంటర్ 1100 నంబర్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సమయపాలన తప్పనిసరి


