కమీషన్ల కోసమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ
తిరుపతి రూరల్: గత ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం కమీషన్ల కోసమే కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆరోపించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యం, వైద్యవిద్యను దూరం చేయడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ జగనన్న ఇచ్చిన పిలుపుతో సైన్యంలా కదిలిన పార్టీ కార్యకర్తలు, విద్యార్థి విభాగం నేతలు అనుకున్న సమయానికి కోటి సంతకాలను పూర్తి చేశారన్నారు.
విద్యార్థి విభాగం నేతలకు
ధన్యవాదాలు
కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో యూనివర్సిటీలు, కాలేజీల చుట్టూ తిరిగి పెద్ద ఎత్తున విద్యార్థులను చైతన్యపరచి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు సేకరించిన విద్యార్థి విభాగం నేతలు అందరికీ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
15న జరిగే ర్యాలీని విజయవంతం చేయండి
తిరుపతిలోని పద్మావతీపురంలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఈ నెల15వ తేదీన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి సంతకాలు పత్రాలను పంపనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీగా ఆ కార్యక్రమం నిర్వహించాలని పార్టీ పెద్దలు నిర్ణయించినందున ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి విద్యార్థి విభాగం నాయకులు తప్పక హాజరై విజయవంతం చేయాలన్నారు.


