అంగన్‌వాడీలతో పెట్టుకుంటే..అధోగతే
తిరుపతి అర్బన్: అంగన్‌వాడీ వర్కర్లతో పెట్టుకుంటే చంద్రబాబు సర్కార్‌కు అధోగతేనని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు వే లాది మంది తమ న్యాయమైన కోర్కెల సాధనకు ధర్నా చేశారు. ఈ సందర్భంగా కందారపు మురళి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్‌వాడీ వర్కర్లకు అండగా ఉంటామని చె ప్పిన చంద్రబాబు, లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాటపై నిలవలేదని మండిపడ్డారు. న్యాయమైన కోర్కెలు మాత్రమే అంగన్‌వాడీ వర్కర్లు అడుగుతున్నారన్నారు. గుజరాజ్ మోడల్‌లో చేస్తామని చెప్పడం కాదని..గుజరాజ్ హై కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అంగన్‌వాడీ వర్కర్ల రూ.24,800, హెల్పర్లకు 20,400 జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వాణిశ్రీ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కె. నాగరాజమ్మ, ఐఏస్టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు గుడ్లూరు భారతి మాట్లాడుతూ పది రకాల యాప్‌లు కాకుండా ఒకే యాప్ ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీలకు పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. మరోవైపు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో నరసింహులకు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ గౌరవాధ్యక్షుడు ప్రసాదరావు, జిల్లా ఉపాధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, జిల్లా కార్యదర్శి మునిరాజా తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీలతో పెట్టుకుంటే..అధోగతే


