విష సంస్కృతికి తెర లేపుతున్నారు!
ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్
చిల్లకూరు: చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టిన తరువాత ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగే హత్యలు, లైంగికదాడులు, కిడ్నాప్‌లు, బెదిరింపులు, దందాలు, రౌడీయిజం తదితర విషసంస్కృతి రోజు రోజుకు పెట్రేగి పోతుందని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ నెల్లూరులో అరాచక శుక్తులు గతంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై దాడి చేసి, భయాందోళనలకు గుర్తిచేసిన సంఘటన ఇంకా మరువలేదన్నారు. అలాగే రోజూ నెల్లూరులో దందాలు, హత్యలు, బెదిరింపులు సాధారణం అయ్యా యని తెలిపారు. ఈ క్రమంలోనే నెల్లూరు 24వ డివిజన కార్పొరేటర్ ఫమీదా తండ్రి నజీర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడం గూడూరు నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రశాంతతకు మారు పేరుగా ఉండేదని, అయితే చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అన్ని వర్గాల వారిని భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరించి కేసు దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బురదమడుగు చెరువు పరిశీలన
దొరవారిసత్రం : మండలంలోని బురదమడుగు గ్రామ పరిధిలోని చెరువును ఇరిగేషన్ శాఖ ఏఈ వీరస్వామి శుక్రవారం సందర్శించారు. ‘సాక్షి’ దినపత్రికలో చెరువు కట్టను తెగ్గొట్టిన భూ ఆక్రమణదారులు’ అనే శీర్షికన కథనం ప్రచురితం కావడంతో సంబంధిత అధికారులు స్పందించారు. చెరువు కట్ట తెగ్గొట్టిన విషయంపై స్థానిక రైతులను కలిసి ఏఈ ఆరా తీశారు. చెరువు పొరంబోకు భూమి ఆక్రమణపై నివేదికను సిద్ధం చేసి రెవెన్యూ అధికారులకు అందజేస్తామన్నారు. అలాగే పంట కాలువ విషయంలో పూర్తి స్థాయిలో సర్వే చేయించిన అనంతరం రానున్న వేసవి కాలంలో పంట కాలువను అభివృద్ధి చేస్తామని చెప్పారు. చెరువు పొరంబోకు భూమి ఆక్రమణలు, పంట కాలువ విషయంపై స్థానిక తహసీల్దార్ శైలకుమారి దృష్టికి కూడా తీసుకువెళ్లామని ఏఈ తెలిపారు.
విష సంస్కృతికి తెర లేపుతున్నారు!


