వీడిన మదనపల్లి మర్డర్ మిస్టరీ
చంద్రగిరి: అదృశ్యమైన వ్యక్తి కేసును ఎట్టకేలకు మదనపల్లి రూరల్ పోలీసులు ఛేదించారు. తన భర్త అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, చర్యలు తీసుకోలేదన్న మృతుడి భార్య విజయలక్ష్మి వేదనపై శుక్రవారం సాక్షి దినపత్రికలో ‘నా భర్త అస్థికలైనా ఇవ్వండయ్యా’ అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది. కథనంపై స్పందించిన పోలీసులు శుక్రవారం చంద్రగిరిలోని ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మదనపల్లి మండలం మాలేపాడు పంచాయతీ రామాపురం గ్రామానికి చెందిన ఆవులపల్లె నరసింహులు(40) వ్యవసాయంతోపాటు నాటు వైద్యం చేసేవాడు. నరసింహులు కురబలకోట మండలానికి చెందిన నాగరాజు, అతని స్నేహితుడు నారాయణస్వామి, కత్తి నరసింహులతో కలసి తిరిగేవాడు. ఈ క్రమంలో నాగరాజు ఇంటికి నరసింహులు పలుసార్లు వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఇంట్లో తన భార్యతో నరసింహులు చనువుగా ఉండడంతో అతడిని నాగరాజు అనుమానించాడు. ఈ నేపథ్యంలో నరసింహులు హతమార్చాలని నాగరాజు పథకం పన్నాడు. దీంతో అక్టోబర్ 27వ తేదీన చంద్రగిరిలో నాటువైద్యం చేయాలని నాగరాజు, ఆవులపల్లె నరసింహులు చెప్పాడు. నరసింహులు, నారాయణస్వామి బస్సులో శ్రీనివాసమంగాపురానికి చేరుకున్నారన్నారు. అక్కడ సిద్ధంగా ఉన్న నాగరాజు బంధువు మునిరాజ వారిద్దరిని తన ద్విచక్ర వాహనంలో నరసింగాపురం సమీపంలోని ఓ మామిడితోటలోకి తీసుకెళ్లారు. అక్కడ నాగరాజు, నారాయణ స్వామి, కత్తి నరసింహులు కలసి ఆవులపల్లె నరసింహులు కాళ్లు చేతులు కట్టేసి కేకలు పెట్టకుండా ప్లాస్టర్‌తో నోటిని మూసివేశారు. అనంతరం ఆవులపల్లె నరసింహులు మెడకు తాడును బిగించి హత్య చేసి, అక్కడే గొయ్యి తవ్వి పూడ్చిపెట్టినట్లు సీఐ తెలిపారు. మృతుడు భార్య విజయలక్ష్మి ఫిర్యాదుతో తహసీల్దార్ శివరామసుబ్బయ్య సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీసి, శవ పంచనామా నిర్వహించి, బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కాగా తన భర్తను చంపిన నిందితులను నుంచి తమకు ప్రాణహాని ఉందని మృతుడి భార్య విజయలక్ష్మి మీడియా ఎదుట వాపోయారు.
వీడిన మదనపల్లి మర్డర్ మిస్టరీ
వీడిన మదనపల్లి మర్డర్ మిస్టరీ
వీడిన మదనపల్లి మర్డర్ మిస్టరీ


