చోరీకి వెళ్లి హత్య
శ్రీకాళహస్తిలో సంచలనం రేపిన హత్య కేసును ఛేదించిన పోలీసులు వారి వద్ద పనిచేసే వ్యక్తి నిందితుడు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు
తిరుపతి క్రైమ్: ఇంట్లో పనిచేసే వ్యక్తి చోరీ చేయడానికి వెళ్లి యజమానులు ప్రతిఘటించడంతో హత్య చేసి, దోచుకెళ్లిన కేసును శ్రీకాళహస్తి పోలీసులు ఛేదించినట్లు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 26వ తేదీన శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్లారెడ్డి కండ్రిగకు చెందిన చెవిరెడ్డి మహదేవ్‌రెడ్డి, జయమ్మ నిద్రిస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. దీనిని గమనించిన జయమ్మ కేకలు వేయడంతో మహదేవ్ రెడ్డి కూడా నిద్రలేచాడు. దుండగుడు భయంతో జయమ్మను కత్తితో పొడిచి, ఆమె మెడలో ఉన్న తాళిబొట్టు చేనుతో పాటు చేతికున్న గాజులను చోరీ చేశాడు. ఈ క్రమంలో ఆమె భర్త మహాదేవరెడ్డి పై దాడికి పాల్పడి, పారిపోయాడు. బాధితుల కుమారుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు మేరకు శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారన్నారు. ఈ క్రమంలో తనిఖీలు చేస్తుండగా తడ–శ్రీకాళహస్తి మెయిన్ రోడ్డులోని తంగెళ్లపాళెం వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా అదుపులోకి తీసుకుని విచారించగా ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయన్నారు. ఈ కేసును ఛేదించడంలో లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, శ్రీకాళహస్తి ఎస్టీపీఓ నరసింహమూర్తి, సీఐలు నాగార్జున రెడ్డి ప్రకాష్ ఎంతగానో కృషి చేశారన్నారు.
చొరీకి పథకం రచించి..
పుల్లిరెడ్డి కండ్రిగకు చెందిన రమేష్ రెడ్డి(42) జయమ్మ వద్దనే పొలంలో పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో అనుకోని కారణాలతో పూర్తి స్థాయిలో అప్పులు కావడంతో ఎలాగైనా అప్పులు తీర్చుకోవడానికి చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే పక్కా ప్లాన్ వేసి, యాజమాని అయిన జయమ్మ ఇంట్లోనే చోరీ చేసేందుకు గత నెల 26వ తేదీన రాత్రి హ్యాండ్ కట్టర్, దుస్తులు, ముఖానికి కట్టుకునే గుడ్డ, కారంపొడి తీసుకుని మృతురాలి ఇంట్లోకి ప్రవేశించారు. అయితే అక్కడ జరిగిన ప్రతిఘటనలో దంపతులపై కత్తితో దాడి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే జయమ్మ మృతి చెందగా ఆమె భర్త గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. నిందితుడి నుంచి తాళిబొట్టు, చైను, రెండు బంగారు గాజులతోపాటు చోరీతోపాటు హత్యకు ఉపయోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు.


