నా భర్త అస్థికలైనా ఇవ్వండయ్యా!
చంద్రగిరి: నా భర్త అస్థికలైనా ఇవ్వండయ్యా అని భర్త మృతదేహం కోసం ఓ ఇల్లాలు కాళ్లరిగెలా తిరుతున్నా పోలీసులు మాత్రం వంకలు చెబుతూ కాలయాపన చే స్తూ, ఆ ఇల్లాలికి శోకాన్ని మిగిల్చుతున్న విషాద ఘట న మదనపల్లిలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే.. మదనపల్లె మండలం రామాపురానికి చెందిన నరసింహులు (35) అక్టోబర్ 27న కనిపించకుండా పో యాడు. కుటుంబం కన్నీళ్లు పెట్టుకుంటూ తిరిగినా, పోలీసులు మాత్రం డైరీలో ఎంట్రీ పెట్టడానికే వారం పట్టింది. ఈ నెల 3వ తేదీన మాత్రమే అదృశ్యం కేసు నమోదు చేశారు. ఆపై నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో విచారించారు. విచారణలో చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో హత్య చేసి పాతిపెట్టినట్టు స్పష్టమైన వివరా లు బయటకొచ్చాయి. తన భర్తను దారుణంగా హత్య చేసి, శ్రీనిసమంగాపురం సమీపంలోని ఓ తోటలో పా తిపెట్టారని తెలుసుకున్న అతని భార్య విజయలక్ష్మి, ముగ్గురు పిల్లలు విలపిస్తున్నారు. రెండు నెలల క్రితం ఘటన జరిగితే, పోలీసులు తీరిగ్గా కేసును ఛేదించడంతో, పాతిపెట్టిన మృతదేహంలో ఎముకల గూళ్లు తప్ప ఏ అవశేషాలు మిగిలే పరిస్థితి లేదు. అయినా తన భర్త అస్థికలైనా ఇప్పించండి సారూ..అంటూ మృతుడి భార్య విజయలక్ష్మి పోలీసులను వేడుకుంటోంది.


