రెవెన్యూ దౌర్జన్యం!
తొట్టంబేడు: ‘ఐసీడీఎస్ సిబ్బందికి సమావేశ మందిరం, గోడౌన్ ముఖ్యం. ఆ రెండూ సమకూర్చిన తర్వాతే బిల్డింగ్‌ని స్వాధీనం చేసుకోండి. అప్పటి వరకు వారి జోలికెళ్లొద్దు. సమస్య సృష్టించొద్దు..’ అంటూ తొట్టంబేడు రెవెన్యూ సిబ్బందికి కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ అవేవీ వారు పట్టించుకోలేదు. మంగళవారం ఉన్న ఫళంగా తొట్టంబేడు మండల కార్యాలయంలో నిర్వహిస్తున్న శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమకు ప్రత్యామ్నాయం ఎక్కడ? అని ప్రశ్నించగా.. అవేవీ తమకు తెలియదు.. ఆర్డీఓ చెప్పారు.. మీరు అక్కడికెళ్లి మాట్లాడుకోండి.. అంటూ బెదిరింపులకు దిగినట్టు సమాచారం. దీంతో శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు రోడ్డున పడినట్టయ్యింది.
అసలేం జరిగిందంటే..
గతంలో మండల కార్యాలయానికి సమీపంలో ఉన్న శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం శిథిలావస్థకు చేరింది. విధిలేని పరిస్థితుల్లో 2019 నుంచి తొట్టంబేడు మండల కార్యాలయంలోనే శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం కొనసాగుతోంది. అక్కడే సమావేశ మందిరం, గోడౌన్ ఉండడంతో కొంత అనుకూలంగా మారింది. కానీ శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు కొనసాగడంపై అక్కడి రెవెన్యూ అధికారులకు కొంత కంటగింపుగా మారింది. దీంతో ఎలాగైనా ఆ భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని స్కెచ్చేశారు. ఈ క్రమంలోనే ఆర్డీఓతో చర్చలు జరిపారు. ఎట్టకేలాకు భవనం స్వాధీనానికి తమకు అనుకూలంగా మలుచుకున్నారు. అదే క్రమంలో ఐసీడీఎస్ సిబ్బంది కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన దీనిపై స్పందిస్తూ ఐసీడీఎస్‌కు ప్రత్యామ్నాయం చూపాలని, సంబంధిత అధికారులను ఆదేశించారు. కానీ అవేవీ పట్టించుకోకుండా మంగళవారం శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడంపై అంగనన్‌వాడీ కార్యకర్తలు రగిలిపోతున్నారు.
ఏంచేయాలబ్బా?
శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో తొట్టంబేడు, శ్రీకాళహస్తి రూరల్, మున్సిపాలిటీ కలిపి 208 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. మొత్తం 416 అంగన్‌వాడీ వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ప్రతి నెలా నాలుగు సార్లు సెక్టార్, ప్రాజెక్టు సమావేశాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం కార్యాలయం లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
పంచాయతీ బిల్డింగ్‌కు తాళాలు
తొట్టంబేడు మండల కార్యాలయంలోని పంచాయతీ బిల్డింగ్‌ను శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్టుకు కేటాయించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అక్కడి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కానీ బిల్డింగ్ కాంట్రాక్టర్ తమకు బిల్లులు రాలేదంటూ పేచీ పెట్టారు. గత సోమవారమే భవనానికి తాళాలు వేసి తీసుకెళ్లిపోయారు. దీనిపై రెవెన్యూ అధికారులు నోరుమెదపలేదు. కాంట్రాక్టర్‌ను ఒప్పించి తాళాలు ఇప్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయమై తొట్టంబేడు తహసీల్దార్ భారతిని వివరణ కోరగా.. తొట్టంబేడు మండల కారాలయంలోని భవనం అవసరమైందన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దష్టికి తీసుకెళ్లామని, ఆయన ఆదేశాలతోనే ఇక్కడ కొనసాగుతున్న శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. వారికి పంచాయతీరాజ్ భవనాన్ని అప్పగించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు.
రెవెన్యూ దౌర్జన్యం!


