విశ్వంలో ఉచిత నవోదయ మోడల్ ఎంట్రన్స్ టెస్ట్
తిరుపతి సిటీ: స్థానిక వరదరాజ నగర్‌లోని విశ్వం విద్యా సంస్థల్లో గురువారం ఉదయం 10 గంటలకు జవహర్ నవోదయ విద్యాలయ – 2026 పరీక్షకు సంబంధించి ఉచిత మోడల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు విశ్వం విద్యాసంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్ విశ్వనాథ రెడ్డి తెలియజేశారు. 6వ తరగతి ప్రవేశానికి జాతీయ స్థాయిలో డిసెంబర్ 13వ తేదీన నిర్వహించే ప్రవేశ పరీక్షకు అనుగుణంగా ఈ నమూనా పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నమూనా పరీక్ష ద్వారా విద్యార్థులు ప్రధాన పరీక్షకు సంసిద్ధం కావడంతో పాటు సబ్జెక్ట్ పరంగా లోపాలను సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. నమూనా పరీక్షకు ఎలాంటి ప్రవేశ రుసుము చెల్లించవలసిన అవసరం లేదన్నారు. పరీక్షకు హాజరయే విద్యార్ధులు హాల్ టికెట్ (అడ్మిట్ కార్డ్) జిరాక్స్ కాపీని వెంట తీసుకురావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 8688888802 / 9399976999 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ప్రైవేటు స్కూల్ బస్సు సీజ్
నాయుడుపేటటౌన్ : జనంపై దూసుకెళ్లిన స్కూల్ బస్సును సీజ్ చేసి, డ్రైవర్‌తోపాటు పెళ్లకూరు మండలం చెంబేడు గ్రామానికి చెందిన ఆ బస్సు ఇన్‌చార్జి తనయాలి సుధీర్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎం చెంచుబాబు తెలిపారు. బస్సుల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేస్తామని డీఎప్పీ హెచ్చరించారు.
హత్య కేసులో నలుగురు
నిందితుల అరెస్టు
వరదయ్యపాళెం: మండలంలోని మిట్ట హరిజనవాడలో గత నెల 30న జరిగిన వంట మాస్టర్ హరి (33) హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సత్యవేడు సీఐ మురళి, ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు. మంగళవారం సీఐ ఈ వివరాలు వెల్లడించారు. మిట్ట హరిజనవాడకు చెందిన వంట మాస్టర్ హరి, అదే గ్రామంలోని గౌతమ్, ప్రేమ్ కుమార్ మధ్య పాత కక్షల ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 30న హరి భార్య దేవసేన ఊరెళ్లింది. ఇదే అదునుగా భావించిన గౌతమ్, ప్రేమ్‌కుమార్ వారి ఇంటికి హరిని పిలిపించుకుని, అతనితో స్నేహభావంగా మెలిగి మద్యం తాగించి హత్యకు పాల్పడ్డారు. అయితే హత్య చేసేందుకు తమిళనాడుకు చెందిన తమ స్నేహితులు జాన్‌పాల్, పెలిస్థియన్ అలియాస్ బెంచిల్‌ను రప్పించుకుని వారి సహకారంతో హత్యకు పాల్పడ్డారు. నిందితులు ఇబ్బలమడుగుకు వెళ్లే మార్గంలో సంచరిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసు కుని విచారణ చేపట్టారు. వారు నేరం అంగీకరించడంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి, కోర్టుకు హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు సీఐ పేర్కొన్నారు.
విశ్వంలో ఉచిత నవోదయ మోడల్ ఎంట్రన్స్ టెస్ట్


