ఆర్టీసీలో అసమర్థ పాలన
తిరుపతి అర్బన్: ఆర్టీసీ అధికారులు అసమర్థ పాలనను సాగిస్తున్నారని ఎన్‌ఎంయూఏ రాష్ట్ర కార్యదర్శి చెంచులయ్య, జిల్లా అధ్యక్షులు జీవీఆర్ కుమార్, సెక్రటరీ బీఎస్ బాబు ధ్వజమెత్తారు. మంగళవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని డీపీటీఓ(జిల్లా ప్రజా రవాణా అధికారి) కార్యాలయానికి ఆర్టీసీ ఎన్‌ఎంయూఏ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం డీపీటీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున పోలీసులు డీపీటీఓ కార్యాలయానికి చేరుకున్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తే తమకు అభ్యంతరం లేదని సూచించారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘం నేతలు తాము శాంతియుతంగా తమ డిమాండ్లను వెల్లడించడానికి మాత్రమే వచ్చామని తెలిపారు. అయితే ఆ సమయంలో డీపీటీఓ జగదీష్ లేకపోవడంతో ఆయన కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్‌ఎంయూఏ నేతలు చెంచులయ్య, జీవీఆర్‌కుమార్, బీఎస్ బాబు మాట్లాడుతూ ఓ వైపు ప్రయాణికులకు..మరోవైపు ఉద్యోగులకు కనీస వసతులు కల్పించడం లేదని మండిపడ్డారు. జిల్లాలో కొత్త బస్సుల ఆవశ్యకతను డీపీటీఓ విజయవాడలోని ఉన్నతాధికారులకు తెలియజేయడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎంయూఏ నేతలు సన్యాసిరావు, టీవీ లక్ష్మీ, గుణశేఖర్, సతీష్, ఆర్ముగం, నాగేశ్వరరావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.


