ఆలయ భూముల్లో క్రీడా మైదానం
సాక్షి టాస్క్ ఫోర్స్: అధికార పార్టీ నేతల ఒత్తిడితో తమ్మినపట్నం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 20లోని సుమారు 30 ఎకరాల ఆలయ భూముల్లో క్రీడా మైదానానికి అనుమతి ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. గూడూరు వేంకటేశ్వరస్వామి గ్రూపు దేవస్థానానికి చెందిన ఈఓ చిల్లకూరు మండలం కలవకొండలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, తీర ప్రాంతంలోని లింగవరం దేవస్థానానికి కూడా అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఆలయాలకు చెందిన భూముల కౌలు వేలం పాటలు నిర్వహించే సమయంలో ఆయన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించి స్థానికంగా ఉండే అధికార పార్టీ నాయకులు ఎవరికి చెబితే వారికే కట్ట బెట్టేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే లింగవరంలోని వ్యాఘ్రేశ్వర స్వామి ఆలయానికి సుమారు 110 ఎకరాల వరకు మాన్యం భూములున్నాయి. ఈ భూములను స్థానికంగా ఉండే పేదలు కొన్నేళ్లుగా వేలం పాటలు పాడుకుని వేరుశనగ సాగు చేసుకునే వారు. ఈ ఏడాది వేలం పాటల నిర్వహణకు సంబంధించి బహిరంగ ప్రకటన ఇవ్వకుండా 80 ఎకరాల వరకు వేలం పాటలు నిర్వహించారు. ఇందులో భాగంగా తమ్మినపట్నం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 20లోని సుమారు 30 ఎకరాలు ఉండగా ఈ భూములకు కూడా వేలం పాటలు నిర్వహించకుండా ఆలయ ఆదాయానికి గండి కొట్టారు. అధికార పార్టీకి చెందిన నాయకుడి ఒత్తిడితో సుమారు 30 ఎకరాలను క్రీడా మైదానం పేరుతో ధారాదత్తం చేశారు. ఆ భూముల్లో క్రీడా మైదానం ఏర్పాటుకు అక్కడి స్థానిక నాయకుడి చేతుల మీదుగా మంగళవారం శంకుస్థాపన కూడా చేశారు. ఈ విషయంపై స్థానికులు అక్కడే ఈఓను ప్రశ్నించగా ‘నా ఇష్టం ఆ భూమికి వేలం పాటలు నిర్వహించడం లేదు.’ అని సమాధానం ఇచ్చారు. ఇదే విషయంపై దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ సుధీర్‌బాబును వివరణ కోరగా ఆలయ భూముల వేలం పాటలకు లింవరం గ్రామానికి తాను కూడా వెళ్లానని, అయితే సర్వే నంబర్ 20లోని 30 ఎకరాల భూములు వేలం వేయలేదనే విషయం తనకు కూడా తెలియదన్నారు. అలాగే అక్కడ క్రీడా మైదానం ఏర్పాటు చేయడంపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వేలం పాటల నిర్వహణ బహిరంగంగానే చేపడతామని, ఇక్కడ కూడా కరపత్రాలు పంపిణీ చేశామని దండోరా వేయడం, ఆటోలో మైక్ అనౌన్స్ చేశారా అనే విషయం తెలియదన్నారు.


