క్రీడలు దినచర్యలో భాగం కావాలి
చంద్రగిరి: క్రీడలు దినచర్యలో భాగంగా కావాలని ఎస్వీ వెట ర్నరీ యూనివర్సిటీ వీసీ డాక్టర్ జేవీ రమణ అన్నారు. ఆచార్య ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం క్రీడా, సాంస్కృతిక పోటీలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ ఆడిటోరియంలో ముగింపు సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అకాడమిక్ అంశాలతో పాటు క్రీడలు కూడా దినచర్యలో భాగం కావాలని సూచించారు. విశిష్టఅతిథిగా పాల్గొన్న శ్రీ వేంకటేశ్వర జులాజికల్ పార్క్ క్యూరేటర్ సి.సెల్వన్ మాట్లాడుతూ క్రీడలు, సాంస్కృతిక పోటీల్లో పాల్గొనడంతో విద్యార్థులకు ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలపై మరింత అవగాహన వస్తుందన్నారు. అనంతరం ఎన్జీరంగా వర్సిటీ పరిధిలోని 19 కళాశాలల విద్యార్థులకు వివిధ క్రీడా సాంస్కృతిక, వ్యక్తిత్వ అంశాల్లో పోటీపడిన వారికి బహుమతులు అందజేశారు. సాంస్కృతిక, వక్తృత్వ అంశాలలో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ విద్యార్థి వ్యవహారాల డీన్ డాక్టర్ రామచంద్రరావు, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎంవీ రమణ, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.రెడ్డి శేఖర్, వెటర్నరీ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జగపతి రామయ్య, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్. రవికాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


