వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేయాలి
తిరుపతి క్రైమ్: తిరుమలలో జరగబోయే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అందరి సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. సోమవారం పోలీస్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాల కారణంగా తిరుమలలో భారీగా పెరగనున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ వ్యవస్థ, లైన్ మేనేజ్‌మెంట్, అత్యవసర స్పందన బృందాల నియామకం, పాదచారి మార్గాల భద్రత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. కుటుంబాలతో వచ్చే చిన్నపిల్లలు తప్పిపోకుండా ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు, చైల్డ్ మిస్సింగ్ టీమ్స్‌ను అదనంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తిరుమల మొత్తం అదనపు భద్రతా సిబ్బందిని మోహరించి, సీసీటీవీ పర్యవేక్షణను బలోపేతం చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే క్విక్ రెస్పాన్స్ టీమ్స్, హెల్త్ సపోర్ట్, అంబులెన్స్ మార్గాలు, ఫైర్ సర్వీసెస్‌తో సమన్వయం చేసుకోవాలన్నారు.


