‘డయల్ యువర్ సీఎండీ’కి 70 వినతులు
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించకూడదని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివ శంకర్ లోతేటి సూచించారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం ’డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించారు. 9 జిల్లాల నుంచి 70 మంది ఫోన్లు చేసి, తమ సమ్యలను వివరించగా సంబంధిత జిల్లా నోడల్ ఆఫీసర్లు వాటిని నమోదు చేసుకున్నారు. సీఎండీ శివశంకర్ లోతేటి మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని సహించబోనని, వినియోగదారులతో అమర్యాదగా మాట్లాడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదుదారుల నుంచి అందుకున్న వినతుల్లో కర్నూలు నుంచి 18, కడప 13, అనంతపురం 15, నెల్లూరు 3, శ్రీసత్యసాయి 3, చిత్తూరు 1, తిరుపతి 11, నంద్యాల నుంచి 6 వినతులు వచ్చాయన్నారు. సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్‌ఖాన్, కె.గురవయ్య, కె. రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు పీహెచ్.జానకీరామ్, జె. రమణాదేవి, ఎన్. శోభావాలెంటీనా, కె. ఆదిశేషయ్య, ఎం.మురళీకుమార్, ఎం.ఉమాపతి, జనరల్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.


