నీటి గుంటలో పడి యువకుడి మృతి
వాకాడు: ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం వాకాడు గొల్లపాళెంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఇన్నమాల ఈశ్వరయ్య (37) అనే యువకుడు మధ్యాహ్న సమయంలో గ్రామానికి సమీపంలోని నీటిగుంటలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లాడు ప్రమాదవశాత్తు గుంటలో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న ఈశ్వరయ్య ఆచూకీ కోసం కోట అగ్రిమాపకశాఖ, అంజలాపురం గ్రామానికి చెందిన మత్స్యకార గజతగాళ్లు సుమారు 5 గంటలపాటు గాలింపు చర్యలు చేపట్టారు. నీటి గుంటలో నుంచి ఈశ్వరయ్య మృతదేహాన్ని వెలికితీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆర్ నిఖిల్ తెలిపారు.
జనాలపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
– మద్యం మత్తులో డ్రైవర్
నాయుడుపేట టౌన్: నాయుడుపేట గడియారం సెంటర్ వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ జనాల మీదకు దూసుకు వచ్చిన సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్‌ను స్థానికులు పట్టుకు ని పోలీసులకు అప్పగించారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్ సుమారు 25 మందికి పైగా విద్యార్థులను ఎక్కించుకుని వస్తుంది. పట్టణంలోని పోలేరమ్మ సెంటర్ వద్ద జనాల మీదకు బస్సు దూసుకువెళ్లడంతో స్థానికులు అడ్డుకున్నారు. బస్సు నడుపుతున్న డ్రైవర్ ఇమ్మానియేల్ మద్యం తాగి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు అప్పగించారు. బస్సులో ఉన్న విద్యార్థులను నిర్వాహకులు వచ్చి గమ్యస్థానాలకు చేర్చారు. డ్రైవర్ ఇమ్మానియేల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
నీటి గుంటలో పడి యువకుడి మృతి


