సమస్యల పరిష్కారానికి సమ్మె నోటీసు
తిరుపతితుడా: రుయా ఆస్పత్రిలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని గత కొన్ని ఏళ్ల నుంచి యాజమాన్యానికి విన్నవించినా పరిష్కరించకపోవడంతో సమ్మెకు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు సీఐటీయూ, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వరంలో సోమవారం రుయా సూపరింటెండెంట్‌తోపాటు కార్మిక శాఖ మంత్రికి, కమిషనర్ ఆఫ్ లేబర్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా కార్మిక శాఖ, సంబంధిత అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఉపాధ్యక్షులు కే వేణుగోపాల్, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జి మునిచంద్ర, నరసింహులు మాట్లాడుతూ పారిశ్రామిక వివాదాల చట్టం 1947 రూల్ నంబర్ 71 ప్రకారం సమ్మె నోటీసులు 18 డిమాండ్లతో ప్రధానంగా ఈ సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. బుధవారం నుంచి కార్మికులందరూ 14 రోజులపాటు నల్ల బ్యాడ్జీలు ధరించి, తమ నిరసన తెలుపుతూ విధులు నిర్వహిస్తారని, 14 రోజుల తర్వాత యాజమాన్యం చర్చించి సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెబాట పట్టాల్సివస్తుందన్నారు.


