ఎన్‌ఎస్‌యూ ఘటనకు బాధ్యులను తొలగించాలి
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో రెండు రోజుల క్రితం జరిగిన దారుణం సభ్యసమాజం తలదించుకునేలా ఉందని ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులను వర్సిటీ నుంచి తొలగించి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం వర్సిటీ ఎదుట పెద్ద ఎత్తన నిరసన కార్యక్రమం చేపట్టాయి. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలను వర్సిటీ అధికారుల చొరవతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ వర్సిటీలో ఎడ్యుకేషన్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ తొలి ఏడాది చదువుతున్న విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేసి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి బెదిరింపులకు గురి చేయడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్, శేఖర్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ ఎస్వీయూ విద్యార్థి సంఘం అధ్యక్షులు ప్రేమ్‌కుమార్ వర్సిటీ ఎదుట అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యాక్షులు డాక్టర్ ఓబుల్ రెడ్డి, చెంగల్ రెడ్డి, పలు విద్యార్థి సంఘాల నాయకులు ప్రవీణ్‌కుమార్, ప్రేమ్‌కుమార్, సుందర్‌రాజు, శివకుమార్, స్వరూప్ కుమార్, యశ్వంత్ రెడ్డి, వినోద్ కుమార్, రఫీ, ప్రదీప్ కుమార్, భాస్కర్ యాదవ్, ఉత్తరాది విజయ్, వినోద్ కుమార్ , నాగేశ్వరరావు , హరి నాయక్ , తిరువర్ధన్ రెడ్డి, ఓబులేసు పాల్గొన్నారు.


