ఆకట్టుకుంటున్న నృత్య, కళాత్మక పోటీలు
చంద్రగిరి: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎస్వీ వ్యవసాయ కళాశాలలో జరుగుతున్న సాంస్కృతిక, క్రీడా పోటీలు మూడో రోజు కొనసాగాయి. ఇందులో భాగంగా ఆదివారం నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అథ్లెటిక్ తదితర పోటీలు అట్టహాసంగా జరిగాయి. నృత్య పోటీలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాలతో పాటు సెటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చదరంగం తదితర విభాగాల్లో విద్యార్థినీ విద్యార్థులు పోటీపడి తమ ప్రతిభను కనబరిచారు. చదరంగం విభాగంలో శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాల, బాల్ బ్యాడ్మింటన్‌లో ఉదయగిరి వ్యవసాయ కళాశాల, 100 మీటర్ల పరుగు పందెంలో తాడిపత్రి వ్యవసాయ కళాశాల, 200 మీటర్ల పరుగు విభాగంలో ఎస్వీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారని కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ రవికాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థి వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ కే హరిప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఆకట్టుకుంటున్న నృత్య, కళాత్మక పోటీలు


