అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వండి
–జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్
తిరుపతి తుడా: తుడా (తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్) పరిధిలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తుడా కార్యాలయంలో శనివారం నిర్వహించిన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ రెండో బోర్డు సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి, ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఉపాధ్యక్షురాలు ఎన్ మౌర్య, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుడా పరిధిలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, శెట్టిపల్లి టౌన్‌షిప్ ఏర్పాటు చేయనున్న ప్రాంతం చదును, శుభ్రం చేసేందుకు టెండర్ పిలవాలని సూచించారు. ఈ సందర్భంగా పెరుమాళ్లపల్లి పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాలకు గ్యాస్ ఆధారిత శ్మశాన వాటిక, కర్మక్రియల షెడ్డు, మరుగుదొడ్లు ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు. ఉప్పరపల్లి నుంచి మహిళా విశ్వవిద్యాలయం వరకు నాలుగు లేన్ల రోడ్డు, మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపారు. రేణిగుంట మండలం సూరప్పకసం వద్ద తుడా పరిధిలో ఏర్పాటు చేసిన పద్మావతినగర్ లే అవుట్‌లో మౌలిక వసతుల కల్పనకు ఆమోదం తెలిపారు. తుడా చైర్మన్ మాట్లాడుతూ తుడా పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు చేపట్టాలని తెలిపారు. ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, తుడా ఉపాధ్యక్షురాలు మాట్లాడుతూ తుడా నిధులు దుర్వినియోగం కాకుండా అన్ని అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా అధికారులందరూ కృషి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో తుడా సెక్రటరి శ్రీకాంత్, సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


