పొగడ్తలే ప్రధానాంశాలుగా సాగిన పీటీఎం
జిల్లాలో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లకు స్పందన కరువు
టీడీపీ, జనసేన నాయకుల హల్‌చల్
40శాతం దాటని తల్లిదండ్రుల హాజరు
విద్యార్థుల ప్రోగ్రెస్, పాఠశాలల ప్రగతి ఊసెత్తెని వైనం
చంద్రబాబు సర్కార్ ప్రగల్భాలు, ఉపన్యాసాలతో ముగిసిన పీటీఎం
సమావేశాలపై పెదవి విరిచిన తల్లిదండ్రులు
తిరుపతి సిటీ: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పొగడ్తలతో పీటీఎం 3.0 సమావేశాలు ముగిశాయి. జిల్లాలో శుక్రవారం నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లు తూతూ మంత్రంగా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ ఆశించిన రీతిలో సమావేశాలు జరగపోవడంతో అధికారులు సైతం నిరుత్సాహపడినట్టు సమాచారం. జిల్లాలోని 2,939 ప్రభుత్వ పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశాలు టీడీపీ సభలను తలపించేలా నిర్వహించారు. సమావేశాలకు హాజరైన తల్లిదండ్రులకు విస్మరించి, స్థానిక టీడీపీ, జనసేన నాయకులకు విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు పెద్దపీట వేసి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
చంద్రబాబు సర్కార్‌ను పొగడ్తలతో ముంచెత్తే ప్రసంగాలే ప్రధానాంశాలుగా జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పీటీఎంలు జరిగాయి. టీడీపీ నాయకుల ప్రధాన అంశాలుగా సమావేశాలు జరిగాయే తప్ప సమస్యల ప్రస్తావనే లేదు. విద్యార్థుల ప్రొగ్రెస్ రిపోర్ట్‌పైనా, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన నాణ్యత, పాఠశాల ప్రగతి, విద్యాబోధనపై అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు చర్చించిన దాఖలు లేవు. సుమారు 2 వేల పాఠశాలలో 30 శాతం మంది తల్లిదండ్రులు సైతం సమావేశాలకు హాజరుకాలేదు. కేవలం వంద పాఠశాలల్లో మాత్రమే 40 శాతం మంది హాజరుకాగా, మరో 300 పాఠశాలలో 35 శాతం మంది తల్లిదండ్రులు హాజరయ్యారు. జిల్లా అధికారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన పేరెంట్స్ మీటింగ్‌కు స్పందన కరువు అవడంతో ఉదయం నుంచి ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. ఎంత ప్రయత్నం చేసినా ఆశించిన రీతిలో సమావేశాలు నిర్వహించలేకపోవడంతో మండల, జిల్లా అధికారులు ఒకింత అసహనానికి గురై విద్యార్థులతో ఫోన్లు చేయించారు.
తిరుపతి జిల్లా సమాచారం
పార్టీ సభలా.. పీటీఎంలా..?
పొగడ్తలే ప్రధానాంశాలుగా సాగిన పీటీఎం


