స్క్రబ్ టైఫస్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
● ఎంపీ గురుమూర్తి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: చిత్తూరు, తిరు పతి జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, వైద్యశాఖ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఆ వ్యాధి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ అత్యధికంగా నమోదవు తున్న జిల్లాల్లో చిత్తూరు ముందంజలో ఉండ డం ఆందోళనకు గురిచేస్తోందన్నారు. తిరుపతి జిల్లాలో కూడా కేసులు పెరుగుతున్నాయని, ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేయకుండా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవా లని కోరారు. ప్రతి ప్రభుత్వాస్పత్రి, ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్ష సదుపాయాలు, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా వైద్యశాఖ తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారులకు సూచించారు. స్క్రబ్ టైఫస్ ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయమయ్యే వ్యాధి కాబట్టి ప్రజలు భయపడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా సమీప ఆస్పత్రిలో వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలని కోరారు.
నేటి నుంచి నాలుగో బాలల సైన్స్ ఫెస్టివల్
తిరుపతి ఎడ్యుకేషన్ : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం(రీజనల్ సైన్స్ సెంటర్)లో ఈ నెల 6, 7వ తేదీల్లో 4వ బాలల సైన్స్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. ఆ మేరకు సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కె.శ్రీనివాస నెహ్రూ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫెస్టివల్‌కు తిరుపతి పరిసరాల్లోని వివిధ పాఠశాలల నుంచి దాదాపు 70 విభిన్న సైన్స్ నమూనాలను విద్యార్థులు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ ప్రదర్శన దోహదపడుతుందన్నారు. ఈ ఫెస్టివల్‌లో సైన్స్ డ్రామా పోటీలతో పాటు స్థిరత్వం, సామాజిక సమస్యలు, ఒత్తిడితో కూడిన సవాళ్లకు ఆచరణాత్మక పరిష్కారాలపై విద్యార్థులు తమ ఆలోచనలను ప్రదర్శించేందుకు వీలుగా ఐడియాథాన్ పోటీని నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు 7వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు ముఖ్యఅతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులు ఈ బాలల సైన్స్ ఫెస్టివల్‌లో పాల్గొనాలని రీజనల్ సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కోరారు.
ఓపెన్ స్కూల్ పరీక్షల ఫీజు తుది గడువు 10
తిరుపతి సిటీ: జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో పదో తరగతి, ఇంటర్మీడియడ్ పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు ఈనెల 10వ తేదీలోపు పరీక్ష ఫీజులు చెల్లించాలని డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రటకనలో తెలిపారు. ఈ మేరకు ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. అపరాధ రుసుము రూ.25తో ఈనెల 12 వరకు, రూ. 50 అపరాధ రుసుముతో ఈనెల 15వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: ప్రస్తుత సమాజంలో విద్యతోనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు చేకూరుతుందని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు. శుక్రవారం స్థానిక చిన్న బజార్‌వీధిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్యవివాహాలు సమాజాన్ని వెనక్కి నెడతాయన్నారు. అవి పిల్లల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. చిన్న వయస్సులో పెళ్లి జరిగిన బాలికలు ఎన్నో మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతున్నారని ఉదాహరణలతో వివరించారు. అందుకే ప్రతి విద్యార్థీ చదువు పూర్తి చేసి, తమ ప్రతిభను వెలికితీసుకుని, స్వయం సమర్థులు అవ్వాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.
స్క్రబ్ టైఫస్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి


