రాజకీయ నాటకం
పరకామణి విచారణ వెనుక ఉద్దేశం అదేనా? వైఎస్ జగన్ ప్రెస్‌మీట్‌తో భుజాలు తడుముకుంటున్న కూటమి నిజాయితీ అధికారి మృతికి కారకులు కూటమి నేతలేనా? భూమన సవాల్‌ని కూటమి నేతలు స్వీకరిస్తారా? లేదా?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: కూటమి నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకుంటున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కూటమి నేతలకు నిద్ర కరువైంది. అందుకే అంతా ఏకమై శుక్రవారం గుంపులు గుంపులుగా ఒకరి తరువాత ఒకరు ప్రెస్‌మీట్లు పెట్టి విమర్శలు చేసి, కడుపు మంటను చల్లార్చుకునే ప్రయత్నాలు చేపట్టారు. కొంత కాలంగా జరుగుతున్న తంతు అంతా కూటమి పొలిటికల్ గేమ్‌లో భాగమేనని వారి ప్రెస్ మీట్లతో తేలిపోయిందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. పరకారమణి కేసు విచారణ పేరుతో వైఎస్సార్‌సీపీ నాయకులను దోషులుగా చూపించే ప్రయత్నం జరుగుతోందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం.. చంద్రబాబు అండ్ కో నేతలకు సవాల్ విసరడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భూమన కరుణాకరరెడ్డి సవాల్‌ని స్వీకరిస్తారా? లేదా.. కోడిగుడ్డుపై ఈకలు పీకిన చందంగా పరకామణి చోరీపై వైఎస్ జగన్, భూమన కామెంట్లను అడ్డుపెట్టుకుని కూటమి నేతలు విమర్శలు చేయటం సమంజసం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. అందులో నెయ్యి కల్తీ అయ్యిందని, పరకామణి విషయంలో వైఎస్సార్‌సీపీ నేతల పాత్ర ఉందంటూ కేసులు నమోదు చేసి, వాస్తవాలకు అతీతంగా విచారణ చేస్తున్నారంటూ అటు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇటు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.


