వాకాడు: ఐదు రోజులుగా జిల్లా వ్యాప్తంగా దిత్వా తుపాన్ ప్రజల గుండెల్లో దడ పుట్టిస్తోంది. ప్రధానంగా సముద్ర తీర ప్రాంత మండలాల్లో భారీ వర్షాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం వాకాడు మండలంలోని 28 గ్రామాలు, కోట మండలంలోని 31 గ్రామాలు, చిల్లకూరు మండలంలో 30 గ్రామాలు, సూళ్లూరుపేట మండలంలో 29 గ్రామాలు, తడ మండలంలో 28 గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు, కాలవలు, నదులు వరద నీటితో పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా జిల్లాలోని 45 వేల ఎకరాల్లో రైతులు నాటిన వరి నాట్లపై వరదనీరు సుమారు 3 నుంచి 5 అడుగుల ఎత్తున ప్రవహిస్తోంది. దీంతో వరి నాట్లు పాచిపోయాయి. ఫలితంగా రైతులకు కంటతడి మిగిలింది. జిల్లాలోని 79 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరంలో అలజడి కొనసాగుతోంది. వాకాడులోని వైఎస్సార్ స్వర్ణముఖి బ్యారేజ్‌లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అందులో 11 గేట్ల ద్వారా 11 వేల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. బ్యారేజ్ నుంచి వరదనీటిని ఒకసారిగా దిగువకు వదలడంతో బాలిరెడ్డిపాళెం– గంగన్నపాళెం మధ్య ఉన్న వంతెన మునిగిపోయి 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే వాకాడు చెరువు పొంగి రహదారులపై ప్రవహించడంతో వాకాడు– చిట్టమూరు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు గ్రామాల్లోని వీధులు నదులను తలపిస్తున్నాయి. పొలాలపై ప్రవహిస్తున్న వరదనీరు కిందకు వెళ్లేందుకు రహదారులు అడ్డురావడం, వాటికి సరైన తూములు ఏర్పాటు చేయకపోవడంతో పంటలు పాచిపోతున్నాయి. కొన్ని చోట్ల రహదారులకు తూములు ఏర్పాటు చేసినప్పటికీ కొందరు భూస్వాములు స్వార్థంతో వాటిని మూసేసి వారి పొలాలను కాపాడుకుంటున్నారు. దీంతో సన్న, చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోయారు.
తొట్టంబేడులో అత్యధికంగా 83.6 మి.మీ వర్షం
జిల్లా వ్యాప్తంగా బుధవారం తొట్టంబేడు మండలంలో 83.6 మి.మీ వర్ష పాతం నమోదైనట్లు జిల్లా అధికార గణాంకాలు చెబుతున్నాయి. తొట్టంబేడు మండలంలతో 83.6 మి.మీ, ఏర్పేడు 61.2 మి.మీ, సత్యవేడు 52.6 మి.మీ, శ్రీకాళహస్తి 51.8 మి.మీ, నాగలాపురం 47.8 మి.మీ, సూళ్లూరుపేట 45.2 మి.మీ, వరదయ్యపాళెం 39.4, పెళ్లకూరు 38.0, దొరవారిసత్రం 37.2, తడ 36.6 వర్షపాతం నమోదైనట్లు జిల్లా అధికారులు తెలిపారు.
దిత్వా.. జనం గుండెల్లో దడ


