పవన్ కల్యాణ్.. పేరూరు చెరువును కాపాడండి
తిరుపతి రూరల్: మండలంలోని పేరూరు చెరువును కాలుష్యం నుంచి కాపాడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను పేరూరు వాసులు కోరుతున్నారు. తిరుపతి రూరల్ మండల పరిషత్ కార్యాలయానికి ఆనుకుని నూతనంగా నిర్మించిన డీడీఓ కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించనున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్‌ను స్వయంగా కలసి లేఖను అందజేయనున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికే తిరుపతి రూరల్ ఎంపీపీ మూలం చంద్రమోహన్‌రెడ్డి ఇటీవల జరిగిన జెడ్పీ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లారన్నారు. ఆ మేరకు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులుకు వినతి పత్రం సమర్పించడంతో ఈ ఏడాది ఆగస్టు 23వ తేదీన ఆర్‌డబ్ల్యూఎస్ ఇన్‌చార్జి ఎస్‌ఈ నరేంద్ర కుమార్, డీఈ ఉపేంద్రరెడ్డి, ఏఈ హిమంతు చౌదరి పేరూరు చెరువును సందర్శించారని చెప్పారు. చెరువుకు వచ్చే మురుగునీటి కాలువలను పరిశీలించి మురుగు నీరు చెరువులో కలుస్తున్నట్టు గుర్తించారని తెలిపారు. ఆ చెరువు కలుషితమైతే సమీపంలోని 32 గ్రామాల్లో తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, ఆ చెరువుకు ఏఏ పంచాయతీల నుంచి మురుగునీరు వస్తుందో గుర్తించిన అధికారులు ఆ మురుగునీటి కాలువలన్నింటినీ ఒక చోటకు తీసుకువచ్చి నీటిని శుద్ధి చేయిస్తామని, ఆ తర్వాత నీటిని బయటకు పంపించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. ఇది జరిగి నాలుగు నెలలు గడిచినా ప్రయోజనం లేదని, నీటి శుద్ధి యంత్రాన్ని తక్షణం మంజూరు చేయించి, పేరూరు చెరువును కాలుష్యం నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


