సప్లిమెంటరీ కథ కంచికేనా!
తిరుపతి సిటీ: ఎస్వీయాలో 2016 నుంచి యూజీ కోర్సులకు సెమిస్టర్ వ్యవస్థను అప్పటి ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దీంతో అప్పటివరకు ఇయర్లీ ప్యాటర్న్‌తో యూజీ చదివి కొన్ని సబ్జెక్టులల్లో తప్పిపోయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. యూజీ ఇయర్లీ ప్యాటర్న్ (1990–91 నుంచి 2014–15 బ్యాచ్‌లు) సప్లిమెంటరీ పరీక్షలకు అవకాశమిస్తూ ఎస్వీయూ అధికారులు గత ఏడాది ఆగస్టు నెలలో నోటిఫికేషన్ విడుదల చేశారు. సబ్జెక్టులు పెండింగ్‌లో ఉన్న విద్యార్థులు 2024 అక్టోబర్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించి దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎస్వీయూ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఇయర్లీ ప్యాటర్న్ కరికులమ్‌లో సబ్జెక్టులు పెండింగ్‌లో ఉన్న విద్యార్థులు ఫీజలు చెల్లించి, సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
అభ్యర్థుల పరిస్థితి ఆగమ్యగోచరం
ఎస్వీయూ పరిధిలో ఇయర్లీ ప్యాటర్న్ విధానంలో డిగ్రీ కోర్సులు పూర్తి చేసి పలు సబ్జెక్టుల్లో తప్పిపోయిన విద్యార్థుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నా తప్పిపోయిన సబ్జెక్టులకు సంబంధించి వర్సిటీ అధికారులు సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించకపోవడంపై దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మరికొందరు అభ్యర్థులు ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్ రంగాల్లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు విడుదలైన క్రమంలో రూ.లక్షలు వెచ్చించి కోచింగ్ తీసుకుంటున్నారు. కానీ డిగ్రీ సప్లమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల కాకపోతే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
షెడ్యూల్ ప్రకటిస్తారా..నిలిపివేస్తారా?
సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు అధికారులు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయకపోవడం దారుణమని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీలో రాజకీయాలు తప్ప విద్యార్థుల సమస్యలు, వర్సిటీ అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించడం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికే విద్యార్థి సంఘాలు, పరీక్ష ఫీజు చెల్లించిన అభ్యర్థులు పలుసార్లు వర్సిటీ అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన వీసీ నర్సింగరావు తక్షణం జోక్యం చేసుకుని, పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.


