పీజీలో ఎస్వీ వైద్య కళాశాల విద్యార్థుల ప్రతిభ
తిరుపతి తుడా: పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యవిద్య పరీక్షలో ఎస్వీ వైద్య కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమని ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు కొనియాడారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను బుధవారం ఆయన ఘనంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబర్‌లో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ నిర్వహించి, పీజీ పరీక్షలలో కళాశాల విద్యార్థుల అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలివడం అభినందనీయమన్నారు. ఎస్వీ వైద్య కళాశాలల్లో అత్యుత్తమ వైద్యవిద్యను అందిస్తున్నామనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. ఇక్కడ వైద్యవిద్యను అభ్యసించిన విద్యార్థులు దేశంలోని ఎటువంటి ప్రముఖ ఆస్పత్రులోనైనా నాణ్యమైన వైద్యాన్ని రోగులకు అందించగలరని పేర్కొన్నారు. ఇందులో బయోకెమిస్ట్రీ విభాగంలో రాష్ట్రస్థాయిలో డాక్టర్ స్నేహ ప్రథమ స్థానం, డాక్టర్ మౌనిక రెండో స్థానం సాధించారని తెలిపారు. అలాగే ఫార్మకాలజీ విభాగంలో డాక్టర్ ఎం శ్రీలక్ష్మి ప్రథమ స్థానం, ఫోరెన్సిక్ మెడిసన్ విభాగంలో డాక్టర్ జనని ప్రథమ స్థానం, డాక్టర్ అరవింద్ ఐదో స్థానం సాధించారని, అలాగే సైకియాట్రీ విభాగంలో డాక్టర్ సుహాని ప్రథమ స్థానం, పీడియాట్రిక్స్ విభాగంలో డాక్టర్ కేఎస్ పవిత్ర ప్రథమస్థానం, డాక్టర్ శరణ్య మురుగేషన్ ద్వితీయ స్థానం, నేత్ర వైద్య విభాగంలో డాక్టర్ బి శ్రావణి ప్రథమ స్థానంలో నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన వైద్యులను విభాగాధిపతులు, వైధ్యాధికారులు, వైద్యులు ఘనంగా సత్కరించి అభినందించారు.


