తిరుపతికి రైల్వే డివిజన్ స్థాయి కల్పించండి
తిరుపతి అర్బన్: స్థానక రైల్వేస్టేషన్‌కు డివిజన్ హోదా కల్పించాలని, ఈ అంశంపై గతంలోనూ పార్లమెంట్‌లో ప్రస్తావించామని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి బుధవారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విన్నవించారు. పార్లమెంట్ సమావేశాలు నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న ఎంపీలు రైల్వేశాఖా మంత్రి కార్యాలయంలో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తిరుపతి రైల్వేస్టేషన్‌ను రూ.300 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ప్రయాణికులు వేంకటేశ్వరస్వామి దర్శనం నిమిత్తం తిరుపతికి వచ్చిపోతుంటారన్నారు. తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలని గతంలోనూ తమకు విన్నవించామని గుర్తుచేశారు. దశాబద్దాలుగా ఈ సమస్య కొనసాగుతుందన్నారు. తిరుపతిని రైల్వే డివిజన్ చేయడంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయన్నారు. అలాగే తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. దక్షిణం వైపు మార్గం మూత వేయడంతో ఎమ్మార్‌పల్లి, పద్మావతి నగర్, ఎస్వీ నగర్, ఉల్లిపట్టెడ ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తే అందరికీ ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. అలాగే నగరి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఆర్కే రోజా విజ్ఞప్తి మేరకు పుత్తూరు ధర్మరాజుల గుడి సమీపంలోని రైల్వే ట్రాక్ సమస్యల పరిష్కారానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ర్యాంపు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే వెందోడు, నాయుడుపేట రైల్వే స్టేషన్లలో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగడం లేదని, స్టాపింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. నవజీవన్, భగత్‌కికోఠి, ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లకు నాయుడుపేటలో స్టాపింగ్ ఏర్పాటు చేయాలతని తెలిపారు. అలాగే కృష్ణ ఎక్స్‌ప్రెస్, తిరుపతి–పూరీ ఎక్స్‌ప్రెస్, తిరుమల ఎక్స్‌ప్రెస్, తిరుపతి–గూడూరు ఫ్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని కోరారు. ఆ మేరకు రైల్వే మంత్రికి వినతిపత్రం అందజేశారు.


